నా రాజీనామాకు కారణమదే: తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan reveals the reason behind his resignation for the first time
  • రాజీనామాపై మౌనం వీడిన ధర్మేంద్ర ప్రధాన్ 
  • జెన్-జీ విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టించారని ఆరోపణ
  • తనపై నిరసనల వెనుక నవీన్ పట్నాయక్ ఉన్నారని విమర్శలు
  • ప్రధాన్ పై విమర్శలకు పోలీసుల లాఠీఛార్జే కారణమన్న బీజేడీ
  • ముందస్తు చర్యగా 30 మంది బీజేడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత, సంబల్‌పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా ఆ అంశంపై స్పందించారు. విద్యార్థులను (జెన్-జీ) తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అందుకే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. జులై 25న రాజీనామా చేసిన సరిగ్గా రెండు వారాల తర్వాత, భువనేశ్వర్‌లోని జీఎం యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"జెన్-జీ మన పిల్లలు. కొంతమంది వారిని తప్పుదోవ పట్టించాలని చూశారు. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవు. పదవి నాకు ముఖ్యం కాదు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి నా రాజీనామాను ప్రతిపాదించాను" అని ప్రధాన్ వివరించారు. భారతదేశంలో ప్రతి ఏటా రెండు కోట్ల మంది పిల్లలు పుడుతున్నారని, గడిచిన పదేళ్లలో 20 కోట్ల మంది జన్మించారని, వారి ఆకాంక్షలే దేశాన్ని 'విశ్వగురువు'గా నిలబెడతాయని ఆయన అన్నారు.

మరోవైపు తన ఒడిశా పర్యటన సందర్భంగా బీజేడీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై కూడా ప్రధాన్ తీవ్రంగా స్పందించారు. ఎయిర్‌పోర్ట్ వద్ద 'ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్' అంటూ బీజేడీ యువజన, విద్యార్థి విభాగం కార్యకర్తలు చేసిన నిరసనలను ప్రస్తావిస్తూ మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. "నేనొక రైతు కొడుకుని. మీరు నన్ను వెనక్కి పొమ్మన్నా, మళ్లీ వస్తాను. నవీన్ బాబు నన్ను ఒడిశా ప్రజలకు అవమానకరమని, చెడ్డవాడినని అంటున్నారు. ఒడిశా ప్రజలు సిగ్గుతో తలదించుకునే పని నేనెప్పుడైనా చేశానా?" అని సభను ప్రశ్నించగా, 'లేదు' అంటూ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రతిష్ఠ‌ను దెబ్బతీసే పని తాను ఎప్పటికీ చేయనని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేసిన వేదికపై బీజేడీ ఎమ్మెల్యే ప్రసన్న ఆచార్య కూడా ఉన్నారు. బీజేడీ నిరసనల నేపథ్యంలో తాను రావాలా? వద్దా? అని ప్రసన్న ఆచార్యను సంప్రదించానని, ఆయన రమ్మని చెప్పడంతోనే వచ్చానని ప్రధాన్ పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలపై బీజేడీ సంబల్‌పూర్ జిల్లా అధ్యక్షుడు రోహిత్ పూజారి బదులిచ్చారు. "ప్రధాన్‌ను ఎవరూ అప్రతిష్ఠ‌పాలు చేయలేదు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ద్వారా ఆయన పార్టీ, ప్రభుత్వమే ఆయన పరువు తీశాయి. పోలీసుల దౌర్జన్యాలకు నవీన్ పట్నాయక్‌ను నిందించడం ఎంతవరకు సమంజసం?" అని పూజారి ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే.. ప్రధాన్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా సుమారు 30 మంది బీజేడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Dharmendra Pradhan
NEET paper leak controversy
Education Minister resignation
BJD protests Odisha
Naveen Patnaik
GM University Bhubaneswar

More Telugu News