చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. చేనేత రంగానికి రూ.980 కోట్లు విడుదల: మంత్రి తుమ్మల

Tummala Nageswara Rao says handloom workers welfare is government goal and releases 980 crore rupees
  • పీపుల్స్ ప్లాజాలో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన తుమ్మల
  • రైతన్నకు, నేతన్నకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను ఇస్తోందని వెల్లడి
  • ‘నేతన్నకు భద్రత’ కింద రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామన్న మంత్రి

చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో 100కు పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. భారతీయ సంస్కృతికి, వారసత్వానికి చేనేత ప్రతీక అని, గద్వాల, పోచంపల్లి, నారాయణపేట వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు, నేతన్నకు సమాన ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి తెలిపారు. చేనేత రంగానికి ఇప్పటివరకు రూ.980 కోట్లు విడుదల చేశామని, అందులో చేనేత రుణమాఫీ కింద రూ.49.27 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. ‘నేతన్న భరోసా’ ద్వారా ఏడాదికి రూ.18,000 ఆర్థిక సాయం, ‘నేతన్నకు భద్రత’ కింద రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. జియో ట్యాగింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, ఐఐహెచ్‌టీ ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహిస్తామని, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Tummala Nageswara Rao
Telangana Handloom Schemes
National Handloom Day
Nethanna Bharosa
Handloom Workers Welfare
Telangana Textile Industry

More Telugu News