తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష.. 2013 లైంగిక దాడి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

Tarun Tejpal sentenced to 10 years in prison Bombay High Court sensational verdict in 2013 sexual assault case
  • తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ కు బాంబే హైకోర్టులో భారీ షాక్
  • పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించిన కోర్టు
  • ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకుంటానన్న తేజ్‌పాల్‌

‘తెహల్కా’ పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ కు బాంబే హైకోర్టులో భారీ షాక్ తగిలింది. 2013 నాటి సంచలనాత్మక లైంగిక దాడి కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ విచారణ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసిన బాంబే హైకోర్టు (గోవా బెంచ్)... ఆయనను దోషిగా ఖరారు చేస్తూ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. 


2021లో మాపుసా సెషన్స్ కోర్టు ఇచ్చిన ‘అక్విట్టల్’ తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం వేసిన అప్పీలుపై విచారణ జరిపిన బెంచ్... ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బాధితురాలి ప్రవర్తనపై విచారణ కోర్టు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ, ఐపీసీలోని రేప్ నిబంధనల (Section 376) ప్రకారం తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లొంగిపోవడానికి ఆయనకు 4 వారాల గడువు ఇచ్చింది.


2013 నవంబరులో గోవాలో జరిగిన ‘థింక్‌ఫెస్ట్’ ఈవెంట్ సమయంలో హోటల్ లిఫ్ట్‌లో తనపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆయన వద్ద పనిచేసిన ఒక మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.


మరోవైపు, కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం తేజ్ పాల్ కోర్టును ఉద్దేశించి మాట్లాడుతూ... తాను బాధితుడినని చెప్పుకుంటూ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేసుకోవడానికి సమయం కావాలని, శిక్ష తగ్గించాలని కోర్టును వేడుకున్నారు. "నా వయస్సు 62 సంవత్సరాలు, నేను ఒక బాధితుడినని భావిస్తున్నాను. నాకు భార్య ఉంది, అంతకుమించి చెప్పడానికేమీ లేదు. మేము ఎగువ కోర్టుకు అప్పీల్ చేసుకోగలమని మాత్రమే నేను చెప్పగలను. దయచేసి నా పట్ల కాస్త వెసులుబాటు చూపించండి. మిగతా అన్ని వాస్తవాలు ఇప్పటికే రికార్డుల్లో ఉన్నాయి" అని తేజ్‌పాల్ కోర్టుకు తెలిపారు.
Advertisement
Tarun Tejpal
Bombay High Court
Tehelka Editor
Sexual Assault Case
Goa ThinkFest
10 Years Jail Sentence

More Telugu News