షేక్ హసీనా ప్రెస్‌మీట్‌లో మాజీ కెప్టెన్ షకీబ్.. బంగ్లాదేశ్‌లో ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

Shakib Al Hasan at Sheikh Hasina press meet petrol bomb attack on house in Bangladesh
  • షేక్ హసీనా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న కొన్ని గంటల్లోనే ఘటన
  • ఇది తమ పార్టీపై జరుగుతున్న ప్రణాళికాబద్ధమైన దాడి అని అవామీ లీగ్ ఆరోపణ
  • డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తానని భారత్ నుంచి ప్రకటించిన షేక్ హసీనా
  • హసీనా ప్రెస్ మీట్‌పై భారత్‌ను వివరణ కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అవామీ లీగ్ మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ నివాసంపై పెట్రోల్ బాంబు దాడి కలకలం రేపింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షకీబ్ పాల్గొన్న కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

బంగ్లాదేశ్‌లోని మగురా పట్టణంలో ఉన్న షకీబ్ పూర్వీకుల నివాసంపై బుధవారం రాత్రి 8:45 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. దుండగులు ఇంటి గేటుపై పెట్రోల్ బాంబు విసిరారని, ఇంటిని కూడా ధ్వంసం చేశారని స్థానిక వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇది పెట్రోల్ బాంబు దాడేనా? అనేది దర్యాప్తు తర్వాతే నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.

ఈ దాడిని అవామీ లీగ్ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనాతో ప్రెస్ మీట్‌లో పాల్గొన్నందుకే షకీబ్ ఇంటిపై ఈ దాడి జరిగిందని ఆరోపించింది. ఇది తమ కార్యకర్తలపై జరుగుతున్న ప్రణాళికాబద్ధమైన దాడి అని సోషల్ మీడియాలో పేర్కొంది.

న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో నిర్వహించిన వర్చువల్ ప్రెస్ మీట్‌లో షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి అరెస్ట్ లేదా ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. 2024 ఆగస్టు 5న ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి షేక్ హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.
Advertisement
Shakib Al Hasan
Bangladesh
Sheikh Hasina
Petrol bomb attack
Awami League
Magura

More Telugu News