వైఫల్యాలకు భయపడొద్దు.. కఠిన మార్గాన్నే ఎంచుకోండి: అమృత వర్సిటీ స్నాతకోత్సవంలో నారా లోకేశ్

Nara Lokesh advises youth to choose the hard path and not fear failure
  • అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవం
  • గౌరవ అతిథిగా మంత్రి నారా లోకేశ్... విద్యార్థులకు దిశానిర్దేశం
  • భవిష్యత్ అవకాశాల కోసం ఏపీ విద్యారంగంలో సమూల మార్పులు
  • యువత ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని మంత్రి లోకేష్ ఆకాంక్ష
  • వైఫల్యాలకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
  • యువత కలల సాకారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతోందని, కృత్రిమ మేధస్సు (ఏఐ), క్వాంటం ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతికతలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ భవిష్యత్ అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, మంత్రి లోకేశ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "యువత కేవలం ఉద్యోగార్థులుగా మిగిలిపోకూడదు, ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలన్నదే మా లక్ష్యం. వారు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, నాయకులుగా ఎదగాలి. ఇందుకోసం విశ్వవిద్యాలయాలను, పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నాం. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, యువత నేర్చుకోవడానికి, నూతన ఆవిష్కరణలు చేయడానికి, నాయకత్వం వహించడానికి అవకాశాలు కల్పిస్తున్నాం" అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యంత ఉత్సాహభరితమైన కాలంలో విద్యార్థులు తమ వృత్తి జీవితాన్ని ప్రారంభిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఒక గొప్ప ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు.

వైఫల్యాలను చూసి భయపడొద్దు
పట్టా పొందుతున్న విద్యార్థులను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ, "ఈరోజు మీ ప్రయాణానికి ముగింపు కాదు, ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం కావాలి. వైఫల్యాన్ని చూసి ఎప్పుడూ భయపడకండి. వైఫల్యం అంటే మీరు సమర్థులు కాదని కాదు, ప్రయత్నించే ధైర్యం మీకుందని అర్థం. విజయం ఎప్పటికీ ప్రయత్నం విరమించని వారినే వరిస్తుంది. ప్రపంచంలో మార్పు తేగలమనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి" అని పిలుపునిచ్చారు. ఈ డిగ్రీ కేవలం విద్యార్థులది మాత్రమే కాదని, వారి తల్లిదండ్రుల త్యాగాలు, కుటుంబ సభ్యుల మద్దతు, గురువుల మార్గనిర్దేశం కూడా ఇందులో ఉన్నాయని గుర్తుచేశారు.

విలువలతో కూడిన విద్య అమృత ప్రత్యేకత
అమృత యూనివర్సిటీ అందిస్తున్న విద్యను మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. "చాలా విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని, పట్టాలను అందిస్తాయి. కానీ అమృత యూనివర్సిటీ ఆలోచించడం, నాయకత్వం వహించడం, సేవ చేయడం వంటివి నేర్పుతుంది. విద్య అంటే కేవలం కెరీర్ నిర్మించుకోవడం మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినదని ఈ వర్సిటీ విశ్వసిస్తుంది. కరుణ, విలువలతో సమాజానికి సేవ చేయడమే విద్య అంతిమ లక్ష్యమన్న పూజ్యనీయులైన 'అమ్మ' దృక్పథం ఎంతో గొప్పది" అని కొనియాడారు. జ్ఞానం మనకు నైపుణ్యాన్ని, సాంకేతికత శక్తిని ఇస్తే, కరుణ వాటికి ఒక పరమార్థాన్ని ఇస్తుందని, అదే అమృత నేర్పే అత్యున్నత పాఠమని అన్నారు.

నైపుణ్యంపై దృష్టి సారించండి
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలంటే సులువైన మార్గాన్ని కాకుండా, సవాళ్లతో కూడిన కఠినమైన మార్గాన్నే ఎంచుకోవాలని లోకేశ్ యువతకు సూచించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని ఉదాహరణగా చూపుతూ, "మీరు ఎక్కడ మొదలుపెట్టారన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారన్నదే ముఖ్యం. విజయం కోసం పరుగులు తీయకుండా, అత్యుత్తమ నైపుణ్యం సాధించడంపై దృష్టి పెట్టండి. అప్పుడు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది" అని హితవు పలికారు. నిరంతరం నేర్చుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉండాలని కోరారు.

యువత కలలకు అండగా ఉంటాం
"భారతదేశం గర్వపడేలా ఏదైనా నిర్మించాలని కలలు కనండి. అది కంపెనీ కావచ్చు, కొత్త టెక్నాలజీ కావచ్చు, లేదా సామాజిక కార్యక్రమం కావచ్చు. మీ కలల సాకారానికి, మీ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాస్తవ సమస్యలను పరిష్కరించడానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మీ జ్ఞానాన్ని ఉపయోగించండి" అని లోకేశ్ ఆకాంక్షించారు. 20 ఏళ్ల తర్వాత విద్యార్థులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా తిరిగి వచ్చి భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అమృత విశ్వ విద్యాపీఠం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ విజయేంద్ర జీ, అడ్మినిస్ట్రేటివ్ డైరక్టర్ స్వామి నిజామృతానందపురి జీ, అమరావతి క్యాంపస్ రిజిస్ట్రార్ విపిన్ నాయర్, డీన్ సికె జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Amrita University Convocation
Andhra Pradesh Education Reform
Venkaiah Naidu
Skill Development
Job Creators

More Telugu News