వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, ఆఫీసులపై ఈడీ సోదాలు: రూ. 3 వేల కోట్ల అక్రమాలపై కన్ను!
- విశాఖ పశ్చిమ వైసీపీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- ఐదు ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఈడీ అధికారులు
- డిపాజిట్ల సేకరణ, నిధుల మళ్లింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు
వైసీపీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్, విశాఖపట్నంలలోని ఐదు విభిన్న ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈడీ అధికారుల బృందం ఈ దాడుల్లో నేరుగా పాల్గొంది.
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్‌గా ఉన్న సమయంలో డిపాజిట్ల సేకరణ, నిధుల మళ్లింపులో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 3,000 కోట్ల మేర చిట్‌ఫండ్ అక్రమాలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా బ్యాంక్ ఖాతాలు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ సాక్ష్యాలు, కీలక పత్రాలను ఈడీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
మళ్ల విజయప్రసాద్ గతంలో 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2019 శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత 2021లో ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వేళ ఈడీ సోదాలు జరగడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.