నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ వీడియో.. నమ్మి కోటి రూపాయలు పోగొట్టుకున్న వ్యాపారి!

  • ఫారెక్స్ ట్రేడింగ్, స్పేస్‌ఎక్స్ ఐపీవో పేరుతో వల
  • నమ్మకం కోసం మొదట చిన్న మొత్తంలో లాభాల జమ
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పూణె సైబర్ పోలీసులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు సైబర్ నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతున్నాయి. తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు ఉన్న ఓ డీప్‌ఫేక్ వీడియోను నమ్మి పూణెకు చెందిన 56 ఏళ్ల వ్యాపారి ఏకంగా రూ. 1.07 కోట్లు పోగొట్టుకున్నారు. ఫారెక్స్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయన్న ఆశతో ఆయన ఈ పెట్టుబడి పెట్టగా, చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పూణె సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం, జూన్ మొదటి వారంలో బాధితుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన చూశారు. అందులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫారెక్స్ ట్రేడింగ్ గురించి వివరిస్తున్నట్లుగా డీప్‌ఫేక్ వీడియో ఉంది. అది నిజమని నమ్మి ఆయన కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయగా, వెంటనే సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఈ పెట్టుబడులతో దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నమ్మబలికి, ఆయన ఆధార్ వివరాలు సేకరించారు.

ఆ తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి 'రిలేషన్‌షిప్ మేనేజర్'గా పరిచయం చేసుకుని, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఖాతా తెరిపించాడు. తొలుత రూ. 20,341 పెట్టుబడి పెట్టగా, దానికి బదులుగా రూ. 1,000 లాభం అని చెప్పి బాధితుడి అసలు బ్యాంకు ఖాతాకే జమ చేశారు. మధ్యలో రూ. 7 లక్షలు విత్‌డ్రా చేసుకునేందుకు కూడా అనుమతించడంతో, ఆ ప్లాట్‌ఫారమ్‌పై బాధితుడికి పూర్తి నమ్మకం కలిగింది.

నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రీ-లిస్టింగ్ షేర్లు తక్కువ ధరకే వస్తున్నాయని, భారీ లాభాలు ఖాయమని స్కామర్లు ఆశ చూపారు. దీంతో బాధితుడు జూన్ 2 నుంచి జులై 23 మధ్యలో 36 లావాదేవీల ద్వారా మొత్తం రూ. 1.07 కోట్లను వారు చెప్పిన వివిధ మ్యూల్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డులో ఆయన పెట్టుబడి రూ. 3.98 కోట్లకు చేరినట్లు కనిపించడంతో, ఆ డబ్బును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా, ప్రాసెస్ ఫీజుల పేరుతో నేరగాళ్లు మరింత డబ్బు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.  
Advertisement

More Telugu News