అమెరికాలో భారతీయుల ఘనత.. ఆగస్టు 15ను 'ఇండియా డే'గా ప్రకటిస్తూ మసాచుసెట్స్ గవర్నర్ ఉత్తర్వులు!

Maura Healey declares August 15 as India Day in Massachusetts to honor Indian community
  • ప్రవాస భారతీయుల సేవలకు గుర్తింపుగా గవర్నర్ మౌరా హీలీ ప్రకటన
  • బోస్టన్ నగరంలోనూ 'ఇండియా డే'గా పాటిస్తూ మేయర్ ఉత్తర్వులు
  • భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత సంఘాల సన్నాహాలు
అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. మసాచుసెట్స్ రాష్ట్రంలో ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీని 'ఇండియా డే'గా అధికారికంగా జరపాలని ఆ రాష్ట్ర గవర్నర్ మౌరా హీలీ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిలో భారతీయ సమాజం పోషిస్తున్న కీలక పాత్రకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు.

1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఆవిర్భవించిందని గవర్నర్ తన ప్రకటనలో కొనియాడారు. వైద్యం, టెక్నాలజీ, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో ఇండియన్-అమెరికన్లు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అమెరికాలో నివసిస్తున్న 50 లక్షల మంది సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3.6 కోట్ల మంది ప్రవాస భారతీయుల పాత్రను ఆమె గుర్తుచేశారు.

మరోవైపు, బోస్టన్ నగర మేయర్ మిషెల్ వూ కూడా ఆగస్టు 15ను 'ఇండియా డే'గా ప్రకటిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.బోస్టన్‌లో కొత్తగా భారత కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె స్వాగతించారు.

గవర్నర్, మేయర్ల నిర్ణయంపై 'ఇండియా అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్' (ఐఏజీబీ) వంటి భారతీయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బోస్టన్ హార్బర్ వద్ద భారీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అమెరికా గడ్డపై భారతీయ సమాజానికి లభించిన ఈ గౌరవం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Maura Healey
Massachusetts India Day
India Independence Day USA
Michelle Wu Boston
Indian Americans Massachusetts
India Association of Greater Boston

More Telugu News