ఇది క్రైస్తవులపై దాడి.. భారత చట్టంపై అమెరికా ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Riley Moore calls Indian FCRA bill an attack on Christians
  • కేంద్రం తెచ్చిన ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై అమెరికా ఎంపీ అభ్యంతరం
  • ఇది భారత్‌లోని క్రైస్తవులపై దాడి అని రిపబ్లికన్ ఎంపీ రైలీ మూర్ విమర్శ
  • లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆందోళన
  • నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే చట్టమని కేంద్రం సమర్థన
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు-2026 (ఎఫ్‌సీఆర్ఏ) ఇప్పుడు అంతర్జాతీయంగా దౌత్యపరమైన చర్చకు దారితీసింది. ఈ బిల్లు భారత్‌లోని క్రైస్తవులపై జరుగుతున్న స్పష్టమైన దాడి అని అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఎంపీ రైలీ మూర్ తీవ్రంగా విమర్శించారు. ఈ చట్టం ప్రస్తుత రూపంలో అమలైతే భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా రైలీ మూర్ స్పందిస్తూ.. భారత్‌లో క్రైస్తవానికి సుదీర్ఘ చరిత్ర ఉందని గుర్తుచేశారు. "సెయింట్ థామస్ మలబార్ తీరానికి వచ్చినప్పటి నుంచి భారత్‌లో క్రైస్తవం ఉంది. అయినప్పటికీ, ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ రద్దయిన లేదా పునరుద్ధరించని చర్చ్‌లు, స్వచ్ఛంద సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చట్టాన్ని సవరించడం ఆందోళన కలిగిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ కొత్త నిబంధన?
కేంద్రం ప్రతిపాదించిన ఈ కొత్త సవరణల ప్రకారం.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ లేదా మతపరమైన సంస్థ ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా లేదా రద్దయినా, ఆ సంస్థ విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తుల నిర్వహణకు ప్రభుత్వం ఒక 'నియోజిత అధికారి'ని నియమిస్తుంది. తద్వారా ఆ ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళతాయి. ఈ నిబంధనపైనే విపక్షాలు, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మిషనరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, ఈ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచడానికి, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ సవరణలు తెచ్చినట్లు సమర్థించుకుంది.  
Advertisement
Riley Moore
FCRA Amendment Bill
India US Relations
Christian Minorities India
Foreign Contribution Regulation Act
Indian Government NGO Assets

More Telugu News