జూరాలకు పోటెత్తుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం

Jurala Project flood flow increases as Srisailam Dam receives Krishna river water
  • కృష్ణానది ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలు
  • జూరాల ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 
  • క్రస్ట్ గేట్లు ఎత్తేసిన అధికారులు.. శ్రీశైలం జలాశయానికి వరద
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కృష్ణానది మాత్రం జలకళను సంతరించుకుంటోంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. వారం రోజులుగా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో జూరాలకు ఇన్‌ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది.

ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా... అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దాదాపు 30,700 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వేగంగా చేరుతోంది.


మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమలతో పాటు భీమా నది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భీమా నది ప్రవాహాలు కూడా తోడైతే జూరాలకు ఇన్‌ఫ్లోలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎగువ నుంచి వచ్చే ప్రవాహం భారీగా పెరిగే సూచనలు కనిపించడంతో, రాబోయే రోజుల్లో శ్రీశైలానికి మరింత జలకళ రానుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Jurala Project
Srisailam Dam
Krishna River flood
Telangana water levels
Maharashtra Karnataka rains
Jurala inflow outflow

More Telugu News