విద్యాశాఖ మంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: రాంచందర్ రావు

Revanth Reddy should resign as Education Minister says Ramachander Rao
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడం లేదని రేవంత్ పై రాంచందర్ రావు విమర్శలు
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నిజాయతీని చాటుకున్నారని కితాబు
  • కాంగ్రెస్ ప్రభుత్వం క్యాండిల్ ర్యాలీలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్య

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన వద్ద ఉన్న విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. 'నీట్' పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి నైతికతను, నిజాయతీని చాటుకున్నారని గుర్తుచేసిన ఆయన, తెలంగాణలో రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు.


విద్యార్థులు, యువత సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం క్యాండిల్ ర్యాలీలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందన్న ఆయన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆయన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నిరసనల వల్లే కేంద్రం దిగివచ్చిందనడంలో ఎలాంటి నిజం లేదన్నారు.


అలాగే 21 ఏళ్లకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాంచందర్‌రావు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వయోపరిమితి మార్పు అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని, లేని అధికారాల గురించి మాట్లాడుతూ యువతను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

Advertisement
Revanth Reddy
Ramachander Rao
Telangana Education Minister
Fee Reimbursement
BJP Telangana
Telangana Politics

More Telugu News