ఇది కదా క్రియేటివ్‌ టీచింగ్‌ అంటే.. అగ్గిపెట్టెలతో వినూత్న అటెండెన్స్‌ బోర్డు!

Sumi Siyag creates innovative matchbox attendance board for students
  • పిల్లలే స్వయంగా హాజరు నమోదు
  • బాధ్యత, క్రమశిక్షణ పెంచే ప్రయత్నం
  • వీడియోకు 2.7 కోట్లకు పైగా వ్యూస్‌
  • టీచర్‌ ఐడియాపై నెటిజన్ల ప్రశంసలు
పిల్లల్లో సృజనాత్మకత, బాధ్యత, స్వీయ క్రమశిక్షణ పెంచాలంటే ఖరీదైన స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లు అవసరం లేదని ఢిల్లీలోని ఓ ప్రాథమిక పాఠశాల టీచర్‌ నిరూపించారు. రోజూ హాజరు పిలిచే సంప్రదాయ పద్ధతికి బదులుగా ఆమె రూపొందించిన వినూత్న ‘అటెండెన్స్‌ బోర్డు’ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న ఆలోచనతో పిల్లల్లో పెద్ద మార్పు తీసుకురావచ్చని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఉపాధ్యాయురాలు సుమీ సియాగ్‌ తరగతి గదిలో ఓ చార్ట్‌పై అగ్గిపెట్టెలతో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రతి అగ్గిపెట్టెపై ఒక్కో విద్యార్థి ఫొటో ఉంటుంది. దానిపైన చార్ట్‌ మీ బయటకు కనిపించేలా ‘A’ (Absent) అనే అక్షరం ఉంటుంది. అదే అగ్గిపెట్టె లోపలి స్లైడ్‌పై ‘P’ (Present) అని రాసి ఉంటుంది. స్కూల్‌కు వచ్చిన వెంటనే పిల్లలు తమ ఫొటో ఉన్న అగ్గిపెట్టెను స్లైడ్‌ చేస్తారు. దీంతో బయట కనిపిస్తున్న ‘A’ అక్షరం కప్పబడిపోయి, లోపల ఉన్న ‘P’ అక్షరం పైకి కనిపిస్తుంది. అంటే ఆ విద్యార్థి స్కూల్‌కు వచ్చినట్లు నమోదవుతుంది. ఇలా పిల్లలే తమ హాజరును స్వయంగా నమోదు చేసుకుంటూ బాధ్యతను అలవాటు చేసుకుంటున్నారు.

ఈ విధానం ద్వారా పిల్లల్లో స్వతంత్రంగా పని చేయడం, బాధ్యత తీసుకోవడం, క్రమశిక్షణ పాటించడం వంటి మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే పెంపొందుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. చదువు అంటే పుస్తకాల్లోని పాఠాలే కాదు.. జీవితంలో ఉపయోగపడే విలువలను కూడా నేర్పించాలనే సందేశాన్ని ఈ టీచర్‌ తన వినూత్న ఆలోచనతో చాటి చెప్పారు.

ఈ వీడియోను సుమీ సియాగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా దాదాపు 2.7 కోట్ల మంది వీక్షించారు. ‘‘ఇదే నిజమైన క్రియేటివ్‌ టీచింగ్‌’’, ‘‘ప్రతి పాఠశాలలో ఇలాంటి ఆలోచనలు ఉండాలి’’, ‘‘పిల్లల్లో బాధ్యత పెంచేందుకు అద్భుతమైన ప్రయత్నం’’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Advertisement
Sumi Siyag
Matchbox Attendance Board
Creative Teaching Methods
Delhi Primary School Teacher
Student Responsibility Discipline
Viral Education Video

More Telugu News