తన తండ్రి బాలకృష్ణ ఆరోగ్యం గురించి నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే..!
- షూటింగ్ సమయంలో గాయపడ్డ బాలకృష్ణ
- హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స
- నాన్న ఆపరేషన్ సక్సెస్ అని తెలిపిన బ్రహ్మణి
- వేగంగా కోలుకుంటున్నారని వెల్లడి
- త్వరలోనే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారన్న బ్రహ్మణి
సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడిన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. గాయం తీవ్రత దృష్ట్యా ప్రత్యేక వైద్యుల బృందం ఆపరేషన్ నిర్వహించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది. శస్త్రచికిత్స అనంతరం ఆయనను నెల రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలో బాలకృష్ణ కుమార్తె, మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రహ్మణి సోషల్ మీడియా ద్వారా ఆయన ఆరోగ్యానికి సంబంధించి అధికారిక సమాచారాన్ని పంచుకున్నారు. నాన్నకు ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా ముగిసిందని, ఆయన వేగంగా కోలుకుంటూ పాత ఉత్సాహాన్ని తిరిగి పొందుతున్నారని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలోకి, పనుల్లోకి వస్తారని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబం కోసం ప్రార్థించి మద్దతుగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలయ్య మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. కాగా, ఈ హఠాత్ పరిణామంతో ఆయన నటిస్తున్న 'NBK 111' సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా విరామం పడింది. బాలయ్య కోలుకున్న వెంటనే తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహకాలు చేస్తోంది.