22ఏ అనేది పొరపాటు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గం: హరీశ్ రావు
- రేవంత్ రెడ్డి భూములను కాజేయడమే పనిగా పెట్టుకున్నారన్న హరీశ్
- మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
- సామాన్యుల ఆస్తులను 22ఏ నుంచి తొలగించాలన్న హరీశ్
తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22ఏ వివాదంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ జాబితాలో భూములను చేర్చడం కేవలం సాంకేతిక పొరపాటు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతో చేసిన పెద్ద దుర్మార్గమని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో 22ఏ బాధితులతో బీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 'భూ భారతి' పేరుతో ప్రజల భూములకు 'భూ హారతి' పడుతోందని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టి భూములను కాజేయడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాల పాలిటెక్నిక్ కళాశాలల భూములపై కన్నేశారని హరీశ్ రావు ఆరోపించారు. భూ సమస్యల పరిష్కారానికి ఫోన్ చేస్తే చాలని ప్రచారం చేసుకున్నారని, కానీ నేరుగా వెళ్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసినా బాధితులకు ఎలాంటి పరిష్కారం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న ప్రభుత్వం... బడా బాబులు నిర్మించిన అక్రమ నివాసాల జోలికి మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 2ఏ నిషేధిత జాబితా నుంచి ముఖ్యమంత్రి నివాసాన్ని తొలగించినప్పుడు, అదే జాబితాలో ఉన్న సామాన్య ప్రజల నివాసాలను, భూములను ఎందుకు తొలగించడం లేదని నిలదీశారు. తక్షణమే పేదల, సామాన్యుల ఆస్తులను 22ఏ జాబితా నుంచి తొలగించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.