నేతన్న భరోసా పెన్షన్ దరఖాస్తు కోసం బ్యాంక్ స్టేట్‌మెంట్ అవసరం లేదు: సవిత
- మాస్టర్ వీవర్ ఇచ్చే ధ్రువీరణ పత్రం, వేతన వివరాలు ఇస్తే సరిపోతుందన్న సవిత
- బ్యాంక్ స్టేట్‌మెంట్ సేకరణలో కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి
- అర్హులైన నేతన్నలందరికీ పింఛన్లు ఇస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'నేతన్న భరోసా' పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో అత్యంత కీలకమైన నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంక్ ఖాతా సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు.
బ్యాంక్ స్టేట్‌మెంట్‌కు ప్రత్యామ్నాయంగా సంబంధిత మాస్టర్ వీవర్ (సొసైటీ/యజమాని) ఇచ్చే ధ్రువీకరణ పత్రంతో పాటు వేతన వివరాల పత్రాన్ని అందిస్తే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ల సేకరణలో అర్హులైన చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను గమనించి ప్రభుత్వం ఈ సులభతర నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ తప్పకుండా పింఛన్లు మంజూరు చేస్తామని, నేతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందోనని అన్నారు.