రేవంత్ డైరెక్షన్‌లోనే అంతా జరిగింది: ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌కు సబితా ఇంద్రారెడ్డి ఫిర్యాదు
- బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై విచక్షణారహితంగా దాడి చేశారన్న సబిత
- ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని వ్యాఖ్య
- తోపులాటలో జగదీశ్వర్ రెడ్డి కిందపడిపోయారని ఆవేదన
తెలంగాణ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనలు దేశంలోనే ఎక్కడాలేని విధంగా కౌరవసభను తలపించాయని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, అయితే 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమను శాసనసభ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని సబితా ఇంద్రారెడ్డి వాపోయారు. కనీసం మహిళా ప్రజాప్రతినిధులనైనా సభలోకి అనుమతించాలని విన్నవించినా పోలీసులు పట్టించుకోలేదని, మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగడమే కాకుండా, పురుష ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కేశారని ఆరోపించారు. ఈ తోపులాటలోనే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కిందపడిపోయారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ఆదేశాలతోనే పోలీసు బలగాలు తమపై ఈ స్థాయిలో విరుచుకుపడ్డాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
శాసనసభ లోపలైనా ఈ దాడిపై ప్రభుత్వం చర్చ జరుపుతుందని, సీఎం లేదా హోంమంత్రి బాధ్యత వహించి మాట్లాడతారని భావించామని, కానీ దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే ఎదురు కేసులు బనాయించారని సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను లైంగికంగా వేధించారంటూ అసత్య ఫిర్యాదులు చేయించడం, కేసీఆర్ నివాసం వద్దకు నిరసనకారులను పంపడం వంటివన్నీ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయం జరగకపోవడం వల్లే తాము ఢిల్లీకి వచ్చి జాతీయ కమిషన్లను ఆశ్రయించాల్సి వచ్చిందని, ఇది తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
వంద రోజుల్లో ఇస్తామన్న హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు మహిళా కానిస్టేబుళ్లను అడ్డుపెట్టుకుని ‘శిఖండి రాజకీయాలు’ చేస్తోందని ధ్వజమెత్తారు. 22ఎ పేరుతో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి భారీ భూదందాకు తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈ దాడుల ఘటనలపై సమగ్ర లేఖలు రాస్తున్నామని, కాంగ్రెస్ నాయకత్వం దీనిపై వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.