వాణిజ్య నౌకపై దాడి.. 13 మంది భారత సిబ్బంది సురక్షితం

వాణిజ్య నౌకపై దాడి.. 13 మంది భారత సిబ్బంది సురక్షితం

Attack on commercial vessel 13 Indian crew members safe
  • ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి
  • గల్లంతైన మరో భారతీయుడి కోసం కొనసాగుతున్న గాలింపు
  • నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదన్న భారత ప్రభుత్వం
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్ పిలుపు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్ తీరంలో ఎంటీఎల్ గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో చిక్కుకున్న 13 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఈ నౌకలో మొత్తం 14 మంది భారతీయులు ఉండగా, గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఒమన్ సైనిక బలగాల సహకారంతో భారత సిబ్బందిని కాపాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో సాయం అందించిన ఒమన్ అధికారులకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నట్లు వివరించింది.

ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, నావికులు లేదా పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులకు పాల్పడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో నౌకాయాన భద్రతను, స్వేచ్ఛా వాణిజ్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే చర్చల ప్రక్రియను ప్రారంభించాలని భారత్ ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేసింది. 
Advertisement
MT El Gaya
Oman coast attack
Indian crew rescued
West Asia maritime tension
Indian Ministry of External Affairs
Commercial vessel attack

More Telugu News