నాయకులు పనిచేయనివ్వడం లేదు.. సగం జీతమే ఇవ్వండి: యూపీ ఐఏఎస్‌ సంచలన లేఖ

Rinku Singh Rahi requests half salary or transfer due to lack of work in UP
  • సగం జీతం ఇవ్వాలన్న ఐఏఎస్‌
  • బదిలీ కోరుతూ ఐదు పేజీల లేఖ
  • మంత్రి, ఎమ్మెల్యేపై జోక్యం ఆరోపణలు
  • హడావుడిగా బదిలీ చేశారని ఆరోపణ
  • మరో రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువ ఐఏఎస్‌ అధికారి రాసిన లేఖ తీవ్ర చర్చకు దారి తీసింది. తనకు పూర్తి స్థాయిలో పని లేకపోవడంతో సగం జీతమే చెల్లించాలని, లేదంటే నిబంధనల ప్రకారం పని చేసే అవకాశం ఉన్న చోటుకు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్ర నియామక, సిబ్బంది శాఖకు ఐదు పేజీల లేఖ పంపారు. ప్రస్తుతం ఎస్‌డీఎం (జ్యుడీషియల్‌)గా పనిచేస్తున్న 2023 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి రింకూ సింగ్‌ రాహీ ఈ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం తన బాధ్యతల్లో రోజుకు సుమారు నాలుగు గంటల పని మాత్రమే ఉంటోందని రాహీ లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ పోస్టులోనే కొనసాగిస్తే సగం జీతం చెల్లించినా అభ్యంతరం లేదని తెలిపారు. అదే సమయంలో పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ రాష్ట్ర మంత్రి స్వతంత్ర దేవ్‌ సింగ్‌, బీజేపీ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ వర్మ పేర్లను కూడా ప్రస్తావించారు.

జలౌన్‌లో ఎస్‌డీఎంగా పనిచేసే సమయంలో అక్రమ భూకబ్జాలు, ఆక్రమణలకు సంబంధించిన వ్యవహారాల్లో చర్యలు తీసుకోవద్దని జిల్లా కలెక్టర్‌ తనకు ఆదేశించారని రాహీ ఆరోపించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ వర్మ కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి స్వతంత్ర దేవ్‌ సింగ్‌కు సంబంధించిన అక్రమ ఆక్రమణల ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరగకుండా అడ్డుకునేందుకు కుట్ర జరిగిందని కూడా లేఖలో ఆరోపించారు.

లక్నోలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత జలౌన్‌లోని రాంరాజా నిరంజన్‌కు చెందిన కోల్డ్‌ స్టోరేజీని తాను తనిఖీ చేశానని రాహీ తెలిపారు. అక్కడ నిర్వహించిన మాక్‌ ఫైర్‌డ్రిల్‌లో అగ్నిమాపక ఏర్పాట్లు సరిగా లేవని గుర్తించానన్నారు. కోల్డ్‌ స్టోరేజీ నిర్వహణకు సంబంధించిన పలు కీలక పత్రాలు కూడా అందుబాటులో లేవని నివేదిక కోరినట్లు వెల్లడించారు.

ఈ వివాదంపై విచారణ కమిటీ నివేదిక రాకముందే తనను హడావుడిగా ఎస్‌డీఎం (జ్యుడీషియల్‌)గా బదిలీ చేశారని రాహీ ఆరోపించారు. జలౌన్‌ జిల్లా పరిపాలన తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ‘జనతా దర్శన్‌’ కార్యక్రమం కేవలం పేరుకే జరుగుతోందని, మూల సమస్యలను పరిష్కరించకుండా తాత్కాలిక చర్యలకే పరిమితమవుతోందని విమర్శించారు.

నిబంధనల ప్రకారం స్వేచ్ఛగా పని చేసే అవకాశం ఉన్న మరో తహసీల్‌కు లేదా మరో జిల్లాకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని రాహీ కోరారు. అది సాధ్యం కాకపోతే మరో రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై పంపాలని కూడా విజ్ఞప్తి చేశారు.
Advertisement
Rinku Singh Rahi
UP IAS officer letter
SDM salary cut request
Uttar Pradesh political interference
Swatantra Dev Singh
Jalaun IAS controversy

More Telugu News