పాలు ఇచ్చి నిద్రపుచ్చి.. బెడ్‌పైకి పామును వదిలి భర్తను చంపిన భార్య!

Atul Panwar killed by wife using snake after drugging him with milk
  • ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన
  • వివాహేతర సంబంధం, రూ. 20 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసమే దారుణం
  •  భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
  • మొబైల్ డేటా, కాల్ రికార్డుల ఆధారంగా గుట్టురట్టు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక దారుణమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతోపాటు రూ. 20 లక్షల భీమా సొమ్మును కొట్టేయడం కోసం ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది. ఈ మరణాన్ని సహజమైన పాముకాటుగా చిత్రీకరించేందుకు వారు చేసిన కుట్రను పోలీసులు ఛేదించి, నిందితులైన భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపూర్‌లో నివసించే అతుల్ పన్వార్, అతని భార్య దామిని కలిసి ఒక ప్లే స్కూల్ నడుపుతున్నారు. ఈ క్రమంలో దామినికి ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ తుషార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను వదిలించుకోవడానికి వీరు మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపాలని చూశారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ కావడంతో మరో భయంకరమైన ప్లాన్ వేశారు. గురువారం రాత్రి దామిని తన భర్త తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతుల్ స్పృహ కోల్పోయిన తర్వాత, తుషార్ సాయంతో ఒక విషసర్పాన్ని తెచ్చి బెడ్‌పైకి వదిలి కరిపించారు. శుక్రవారం ఉదయం అతుల్ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించగా, అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తొలుత ఇది సాధారణ పాముకాటు మరణంలా కనిపించినప్పటికీ, పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. దీంతో రూరల్ ఎస్పీ అభిజీత్ కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు.. దామిని, తుషార్‌ల మొబైల్ ఫోన్ రికార్డులను, లొకేషన్ డేటాను నిశితంగా పరిశీలించారు. దాంతో వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, హత్య జరిగిన రాత్రి వారి కదలికలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుడైన తుషార్‌కు కూడా ఇదివరకే పెళ్లయిందని, తన భార్యకు విడాకులు ఇచ్చి దామినితో కలిసి ఉండటానికే ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది.  
Advertisement
Atul Panwar
Meerut snake bite murder
Damini Tushar arrest
Uttar Pradesh crime news
Insurance fraud murder
Hastinapur murder case

More Telugu News