గాంధీభవన్‌కు రావొద్దు.. నేతలకు సీఎం రేవంత్‌ కఠిన ఆదేశాలు!

Revanth Reddy orders Congress leaders to focus on voter list revision
  • ఎస్‌ఐఆర్‌పై రేవంత్‌ కఠిన ఆదేశాలు
  • ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలని నేతలకు సూచన
  • గాంధీభవన్‌కు రావొద్దన్న సీఎం
  • నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
  • ఉత్తమ 100 బీఎల్‌ఏలకు రాహుల్‌తో కలిపిస్తామని హామీ
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేశారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో ఉండి ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఎస్‌ఐఆర్‌పై నేడు నిర్వహించిన వర్చువల్‌ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎస్‌ఐఆర్‌ సమన్వయకర్తలు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, పార్టీ ఇన్‌ఛార్జిలంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా మంత్రులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని, చివరి బాధ్యత వారిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమన్వయ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడాన్ని అవకాశంగా మలుచుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం నుంచి 10 మంది ఇన్‌ఛార్జి మంత్రులు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొంటూనే ఎంపీలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో సమీక్షలు కొనసాగించాలని ఆదేశించారు. బాధ్యతలు నిర్వర్తించని ఎంపీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో 489 ఎస్‌ఐఆర్‌ సమావేశాలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు. వెనుకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది నాయకులు హైదరాబాద్‌కే పరిమితమై పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు ఎవరూ రావొద్దని సీఎం స్పష్టం చేశారు. ఛైర్మన్‌ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్‌ చుట్టూ తిరిగేవారికి నియామకాలు ఉండవని తేల్చిచెప్పారు. జులై 30న మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు పరిశీలిస్తామని వెల్లడించారు.

బూత్‌ లెవల్‌ అధికారుల (బీఎల్‌ఓ) నివేదికలపై మాత్రమే ఆధారపడొద్దని సీఎం సూచించారు. పార్టీ తరఫున పనిచేస్తున్న బూత్‌ లెవల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) నివేదికలను కూడా తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. పార్టీ బీఎల్‌ఏలతో నిరంతర సమన్వయం కొనసాగించాలని, క్షేత్రస్థాయిలో వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

రానున్న పది రోజులు నాయకులంతా నియోజకవర్గాల్లోనే పర్యటించాలని రేవంత్‌రెడ్డి చెప్పారు. గాంధీభవన్‌ బృందం బీఎల్‌ఏ, బీఎల్‌ఓ నివేదికలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అత్యుత్తమంగా పనిచేసిన 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్‌ గాంధీని కలిసే అవకాశం కల్పించడంతో పాటు ఆయనతో ఫొటో దిగే అవకాశం కూడా ఇస్తామని ప్రకటించారు.
Advertisement
Revanth Reddy
Telangana Congress
Voter List Revision
Gandhi Bhavan
Special Summary Revision SSR
Bhatti Vikramarka

More Telugu News