లైవ్ లొకేషన్ పంపి మరీ... ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది!

Hasini kills husband with lover by sharing live location
  • చిత్తూరు జిల్లాలో ఆలయానికి వెళ్తుండగా ఘటన
  • లైవ్ లొకేషన్ షేర్ చేసి భర్త కదలికలు చేరవేత
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
  • భార్య, ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు
ప్రియుడి వ్యామోహంలో పడి కట్టుకున్న భర్తనే కిరాతకంగా అంతమొందించింది ఓ భార్య. గుడికి వెళ్దామని నమ్మించి, లైవ్ లొకేషన్ ద్వారా భర్త కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి 19 ఏళ్ల హాసిని, ఆమె ప్రియుడు యుగంధర్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సూళగిరికి చెందిన రమేష్ (23)కు, హాసినికి రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే, వివాహానికి ముందు నుంచే హాసిని తన చిన్ననాటి స్నేహితుడు యుగంధర్ (20)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, అమావాస్యను పురస్కరించుకుని గుడుపల్లె మండలం మల్లప్ప కొండపై వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళదామని హాసిని తన భర్తను నమ్మించింది.

భర్త, కుమార్తెతో కలిసి బైక్‌పై వెళుతూనే, హాసిని తన లైవ్ లొకేషన్‌ను ప్రియుడు యుగంధర్‌కు షేర్ చేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, కొండపైకి వెళ్లే మార్గంలోని మూడో హెయిర్‌పిన్ బెండ్ వద్దకు చేరుకోగానే, తన హ్యాండ్‌బ్యాగ్ కింద పడిపోయిందని చెప్పి భర్తతో బండిని ఆపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న యుగంధర్, అతని స్నేహితులు రమేష్‌ను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి వేటకొడవళ్లతో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘోరం జరుగుతున్న సమయంలో వారి చిన్నారి కుమార్తె అక్కడే ఉండటం గమనార్హం.

రమేష్, హాసినిలు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన హాసిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయ మార్గంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కీలక ఆధారాలు లభించాయి. రమేష్‌తో కలిసి వెళ్లిన హాసిని, తిరుగు ప్రయాణంలో మాత్రం వేరే వ్యక్తులతో కలిసి బైక్‌పై వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుల మొబైల్ రికార్డులు, లొకేషన్ డేటా ఆధారంగా గాలించిగా రమేష్ మృతదేహం లభ్యమైంది. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హాసిని ఫోన్‌ పరిశీలించి ప్రియుడికి లైవ్ లొకేషన్ పంపిన ఆధారాలను సేకరించారు.
Advertisement
Hasini
Yugandhar
Chittoor Murder Case
Ramesh Murder
Mallappa Konda
Live Location Crime

More Telugu News