త్వరలోనే ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేస్తారు: సంజయ్ రౌత్
- త్వరలోనే మోదీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న సంజయ్ రౌత్
- ఫడ్నవీస్‌కు కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు ఇస్తారని జోస్యం
- మహారాష్ట్రకు బీజేపీకి చెందిన మరోనేత సీఎం అవుతారని వ్యాఖ్య
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం రేపేలా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్గం ఫైర్‌బ్రాండ్ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేసి, ఢిల్లీ బాట పట్టబోతున్నారంటూ ఆయన జోస్యం చెప్పారు.
రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో కేంద్రంలో మోదీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని, అదే జరిగితే మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సీఎం ఫడ్నవీస్‌ను ఢిల్లీకి పిలిపించి కేంద్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని, ఆయన స్థానంలో బీజేపీకి చెందిన ఒక సీనియర్ నేతను మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన (UBT) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న 'రామ రక్షా ఆందోళన్’ సన్నాహకాలను పర్యవేక్షించేందుకు నాగ్‌పూర్ వెళ్లిన సంజయ్ రౌత్.. అక్కడి నుంచే ఈ పొలిటికల్ బాంబ్ పేల్చారు.