జీతాలా? అవకాశాలా?.. ఇస్రో మేధోవలస వెనుక కారణాలివే!

ISRO brain drain reasons salaries or opportunities
  • ఇస్రోను వీడుతున్న అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు
  • కొన్ని నెలల్లోనే 100 మందికి పైగా రాజీనామా లేదా వీఆర్ఎస్
  • ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు అందిస్తున్న అవకాశాలే ప్రధాన కారణం
  • గగన్‌యాన్ వంటి ప్రాజెక్టుల శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం ఆంక్షలు
  • నియామక విధానాల్లో మార్పులు అవసరమంటున్న నిపుణులు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగ వైఫల్యాలు లేదా సాంకేతిక లోపాలతో కాకుండా, ఊహించని సరికొత్త సవాలును ఎదుర్కొంటోంది. అదే.. సంస్థ నుంచి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల వలసలు. గత కొన్ని నెలల్లోనే 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, కీలక శాస్త్రవేత్తలను సంస్థలోనే నిలుపుకునేందుకు చర్యలు చేపట్టింది. గగన్‌యాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తల రాజీనామాలను, వీఆర్ఎస్‌లను పరిమితం చేస్తూ అంతరిక్ష విభాగం (Department of Space) ఇటీవలే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం దేశ అంతరిక్ష కార్యక్రమాలకు నిపుణుల సేవలు ఎంత కీలకమో చెబుతున్నప్పటికీ, అసలు శాస్త్రవేత్తలు ఇస్రోను ఎందుకు వీడుతున్నారనే పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.

ప్రధాన కారణాలు ఇవే!
ఇస్రో శాస్త్రవేత్తల వలసల వెనుక అనేక కారణాలున్నాయని అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థలోని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో వేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 2020లో ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరిచిన తర్వాత స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, ధ్రువ స్పేస్ వంటి స్టార్టప్ కంపెనీలు భారత ఏరోస్పేస్ ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ సంస్థలు రాకెట్లు, ఉపగ్రహాలు, ప్రొపల్షన్ సిస్టమ్‌లను వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి.

ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ సంస్థలతో పోలిస్తే మెరుగైన జీతాలు, స్టాక్ ఆప్షన్లు, పనిలో సౌలభ్యం వంటివి అందిస్తున్నాయి. అంతేకాకుండా స్టార్టప్‌లలో యువ శాస్త్రవేత్తలకు సైతం నాయకత్వ బాధ్యతలు త్వరగా లభించడంతో పాటు వినూత్న టెక్నాలజీలను నిర్మించే అవకాశం దొరుకుతోంది. గతంలో ఇస్రోలో ఉన్నత పదవుల్లో పనిచేసి రిటైర్ అయిన పలువురు నిపుణులు ఇప్పుడు ప్రైవేట్ స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేస్తుండటం కూడా ఈ వలసలకు ఊతమిస్తోంది.

సంస్థాగత సమస్యలు.. ప్రాజెక్టుల జాప్యం
ప్రైవేట్ రంగ ఆకర్షణ ఒక కారణమైతే, ఇస్రోలో నెలకొన్న కొన్ని అంతర్గత సమస్యలు కూడా శాస్త్రవేత్తలు బయటకు వెళ్లేందుకు దోహదపడుతున్నాయి. గగన్‌యాన్ జీ1 టెస్ట్ ఫ్లైట్, ఎస్‌ఎస్‌ఎల్‌వీ-ఎల్1, జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 వంటి అనేక కీలక ప్రయోగాలు నిర్దేశిత గడువు కంటే ఆలస్యమవుతున్నాయి. ఈ ఏడాది రెండు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఎదురైన వైఫల్యాలు కూడా ప్రయోగాల షెడ్యూల్‌ను మరింత ఆలస్యం చేశాయి. దీనిపై సంస్థ ఇప్పటివరకు పూర్తిస్థాయి విశ్లేషణను వెల్ల‌డించ‌లేదు.

వీటికి తోడు నిర్ణయాధికారం అంతా ఛైర్మన్ కార్యాలయం వద్ద కేంద్రీకృతం కావడం వల్ల అనుమతులు ఆలస్యమవుతున్నాయని, ఇది కార్యాచరణ స్వేచ్ఛను పరిమితం చేస్తోందని కొందరు ప్రస్తుత, మాజీ అధికారులు ఆంతరంగికంగా అభిప్రాయపడుతున్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మాదిరిగా ప్రాజెక్ట్ ఆధారిత నియామకాలతో కూడిన హైబ్రిడ్ మోడల్‌ను ఇస్రో అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల సంస్థలో కీలక నైపుణ్యాలను కాపాడుకుంటూనే, అవసరమైన సౌలభ్యం లభిస్తుంది.

ప్రభావం.. ప్రభుత్వ చర్యలు
ఇస్రోలోని మొత్తం 14,600 మంది ఉద్యోగులతో పోలిస్తే వలస వెళ్లిన వారి సంఖ్య తక్కువే అయినా, వారి నిష్క్రమణ ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే వెళుతున్న వారిలో చాలామంది చంద్రయాన్-3, స్పాడెక్స్, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఎన్నో ఏళ్ల ప్రత్యేక నైపుణ్యం సంపాదించినవారే. వీరి స్థానాన్ని కొత్త గ్రాడ్యుయేట్లతో భర్తీ చేయడం అంత సులభం కాదు. 

ఈ నేపథ్యంలోనే అంతరిక్ష విభాగం జులై 14న జారీ చేసిన మెమోరాండం ద్వారా గగన్‌యాన్ వంటి కీలక ప్రాజెక్టుల శాస్త్రవేత్తల రాజీనామాలను నేరుగా ఆమోదించకుండా, ప్రతి దరఖాస్తును తమ పరిశీలనకు పంపాలని స్పష్టం చేసింది. ఒకప్పుడు భారత ఏరోస్పేస్ ఇంజనీర్లకు ఇస్రో మాత్రమే ఏకైక గమ్యస్థానంగా ఉండేది. కానీ నేడు ప్రైవేట్ రంగం ప్రత్యామ్నాయ కెరీర్ మార్గాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడమే కాదు, వారిని సంస్థలోనే నిలబెట్టుకోవడం కూడా ఇస్రోకు ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది.
Advertisement
ISRO
Indian Space Research Organisation
Brain Drain
Space Startups India
Gaganyaan Mission
Scientist Resignations

More Telugu News