ఓట్లు వేయలేదనే కక్షతోనే సీతారామ ప్రాజెక్ట్‌ను గాలికి వదిలేశారు: బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ఫైర్

Ponguleti Srinivas Reddy slams BRS for neglecting Sitarama Project over poll loss
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించలేదని బీఆర్ఎస్ కక్షగట్టిందన్న పొంగులేటి
  • సీతారామ ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపాటు
  • అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని ఎప్పుడూ సరిగా ఆదరించడం లేదనే కక్షతోనే... ఆ జిల్లాకు అత్యంత కీలకమైన సీతారామ ప్రాజెక్టుతో పాటు పలు నీటి పారుదల ప్రాజెక్టులను గత పాలకులు గాలికి వదిలేశారని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఈరోజు ఆయన ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.


గత ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయలేదనే కోపంతో... గిరిజనులు అధికంగా ఉండే కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు లైఫ్ లైన్ లాంటి సీతారామ ప్రాజెక్ట్‌కు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పొంగులేటి ఆరోపించారు. ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్‌ఎస్ పెద్దలు కడుపులో విషం పెట్టుకుని, అబద్ధాలు ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ప్రజల కష్టాలను గుర్తించని నాటి నాయకులు... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూసి జ్ఞానం తెచ్చుకోవాలని హితవు పలికారు.


"గత ప్రభుత్వం కట్టిందని మేము ఏ ప్రాజెక్ట్‌ను వదిలేయం. ఎటువంటి భేషజాలకు, పట్టుదలకు పోకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం. సీతారామతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూడా పునరుద్ధరించే తపనతో పనిచేస్తున్నాం" అని మంత్రి స్పష్టం చేశారు. దివంగత రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాజెక్ట్‌లకు మహర్దశ పట్టినట్లే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దశలవారీగా నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.


గత పాలకులు ఉన్న నిధులన్నీ కొల్లగొట్టినా... కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేస్తూ ఒకవైపు సంక్షేమ పథకాలను, మరోవైపు ప్రాజెక్టులను నడిపిస్తోందని పొంగులేటి వివరించారు. గతంలో ఈ సీతారామ ప్రాజెక్ట్‌కు కేవలం రూ. 115 కోట్లు మాత్రమే ఖర్చు చేసి వదిలేశారని... కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం నిధులిచ్చి, 1,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఖమ్మం, వైరా, సత్తుపల్లి తదితర ప్రాంతాల తాగునీటి అవసరాలను తీరుస్తోందని చెప్పారు. దీని ద్వారా ప్రస్తుతం 1.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ కరవు నుంచి రైతులను కాపాడుతున్నామని, అవసరమైతే అదనంగా కూడా నీటిని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం గట్టిగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Ponguleti Srinivas Reddy
Sitarama Project
BRS Party
Khammam Irrigation
Telangana Congress Government
Revanth Reddy

More Telugu News