రాయలసీమ కరవుకు గోదావరి జలాలే శాశ్వత పరిష్కారం: సత్యకుమార్ యాదవ్
- పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సత్యకుమార్, పురందేశ్వరి, మాధవ్ తదితరులు
- పోలవరం కోసం మరో రూ. 30 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం రెడీగా ఉందన్న సత్యకుమార్
- పోలవరంను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న మాధవ్
రాయలసీమ ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న కరవు రక్కసిని తరిమికొట్టేందుకు గోదావరి జలాల తరలింపే శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ భారీ ఆర్థిక మద్దతు ఇస్తోందని ఆయన కొనియాడారు. ఈరోజు జరిగిన పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర సందర్భంగా.. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 20,700 కోట్లను విడుదల చేసిందని సత్యకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో రూ. 30 వేల కోట్లు ఇచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. ఈ సందర్శన యాత్ర ద్వారా ప్రాజెక్టులోని లోటుపాట్లను గుర్తించి త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ గత ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన 80 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా రాబోయే పది రోజుల్లోనే నీటిని విడుదల చేస్తామని పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమను సైతం సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులను శరవేగంగా పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది.