100 కేసులు పెట్టినా భయపడను.. ముద్రగడ ఆత్మ శాంతి కోసమే అడ్డుకున్నా: అంబటి రాంబాబు
- ప్రభుత్వం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందన్న అంబటి
- ముద్రగడ బతికున్నప్పుడు ఆయనను చిత్రహింసలకు గురిచేశారని మండిపాటు
- ప్రభుత్వంపై కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని వ్యాఖ్య
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై తనపై కేసు నమోదు కావడం పట్ల మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కాపులపై వేధింపులు విపరీతంగా పెరిగాయని ఆరోపిస్తూ, తనను ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని ధ్వజమెత్తారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను అంబటి రాంబాబు పూర్తిగా సమర్థించుకున్నారు. చనిపోయిన తర్వాత కూడా ముద్రగడ భౌతికకాయం వద్ద రాజకీయం చేయాలని చూశారని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ముద్రగడ పద్మనాభం బతికున్నప్పుడు ఆయన్ను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని, చనిపోయాక ఇప్పుడు అధికారిక లాంఛనాలు ఇస్తామనడం రాజకీయ కుట్రని అంబటి ఆరోపించారు. "ప్రభుత్వ లాంఛనాలు మాకొద్దు అని ఆయన కుటుంబం ముందే స్పష్టం చేసింది. వాళ్లు వద్దంటున్నా పోలీసులు ఎందుకు వచ్చారు? ముద్రగడ ఆత్మ శాంతించడం కోసమే మేము పోలీసులను అడ్డుకున్నాం. ఇందులో ఎలాంటి తప్పు లేదు" అని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, రాష్ట్ర డీజీపీ తనపై ప్రత్యేక నిఘా పెట్టారని అంబటి ఆరోపించారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అమరావతి వెళ్లినప్పుడు, అలాగే రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా తనపై అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేశారు. తనపై వంద కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
"తాను కాపుల ప్రతినిధిని కానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నప్పుడు, ఆయన ఇంకా కూటమిలో ఎందుకు కొనసాగుతున్నారు?" అని అంబటి ప్రశ్నించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల కాపు సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.