ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కావాలా? ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌ను పరిశీలించొచ్చు..!

Post Office Monthly Income Scheme benefits and interest rates
  • పీఓఎంఐఎస్‌లో ఐదేళ్ల పాటు నెలవారీ ఆదాయం
  • రిటైర్‌ అయిన వారికి ఎక్కువ అనుకూలం
  • ప్రతి పెట్టుబడిదారుడికి సరిపోదంటున్న నిపుణులు
  • మధ్యలో డబ్బు తీసుకుంటే షరతులు వర్తిస్తాయి
  • వడ్డీపై ఆదాయపన్ను వర్తిస్తుంది
  • ఇతర పెట్టుబడులతో కలిపి వినియోగించడం మేలంటున్న నిపుణులు
డబ్బు దాచుకోవడం ఒక్కటే కాదు.. ఆ దాచుకున్న డబ్బు నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రిటైర్మెంట్‌ తర్వాత జీతం ఉండదు కాబట్టి ప్రతి నెలా ఖర్చులకు ఒక స్థిరమైన ఆదాయం ఉండాలని చాలా మంది భావిస్తారు. అలాంటి సమయంలో ‘పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌’ (పీఓఎంఐఎస్‌) చాలామందికి గుర్తుకొచ్చే పథకం. అయితే ప్రభుత్వ పథకం కాబట్టి అందరి అవసరాలకు సరిపోతుందని అనుకోవడం సరికాదు. పెట్టుబడి పెట్టే ముందు ఈ పథకం మీకు సరిపోతుందా? లేదా? తెలుసుకోవడం ముఖ్యం.

అసలు ఆకర్షణ ఇదే
‘పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌’లో పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు ప్రతి నెలా నిర్ణీత వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు వచ్చినా నెలవారీ ఆదాయంపై ప్రభావం ఉండదు. అందుకే రిటైర్డ్‌ ఉద్యోగులు, క్రమం తప్పకుండా నెలనెలా డబ్బు రావాలని కోరుకునే వారు ఈ పథకాన్ని ఎంచుకుంటారు. ఎక్కువ లాభాల కంటే స్థిరమైన ఆదాయానికి ప్రాధాన్యం ఇచ్చే వారికి ఇది అనుకూలం.

ప్రతి ఒక్కరికీ సరిపోయే పథకం కాదు
20-30 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టే వారి లక్ష్యాలు, రిటైర్‌ అయిన వారి అవసరాలు ఒకేలా ఉండవు. ఇంకా ఉద్యోగ జీవితంలో ఉన్నవారు భవిష్యత్తు కోసం సంపద పెంచే పెట్టుబడులను కోరుకుంటారు. ఇప్పటికే రిటైర్మెంట్‌ నిధి సిద్ధంగా ఉన్నవారు మాత్రం భద్రతతో పాటు నెలవారీ ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ పథకం ఎంత బాగుందన్నది కాదు.. అది మీ ఆర్థిక లక్ష్యానికి సరిపోతుందా లేదా అన్నదే ముఖ్యం.

డబ్బు అవసరమైతే
ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. మధ్యలో ఖాతా మూసేసే అవకాశం ఉన్నా కొన్ని షరతులు ఉంటాయి. అందుకే తక్కువ సమయంలోనే డబ్బు అవసరం ఉండే అవకాశం ఉంటే ఈ విషయాన్ని ముందే పరిగణనలోకి తీసుకోవాలి. నెలవారీ వడ్డీ వస్తోందని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని నిపుణులు సూచిస్తున్నారు.

పన్ను వర్తిస్తుంది
ఈ పథకం నుంచి వచ్చే వడ్డీ మొత్తం పూర్తిగా మీ చేతిలో మిగలదు. అది ఆదాయపన్ను శ్లాబ్‌కు అనుగుణంగా పన్ను పరిధిలోకి వస్తుంది. అలాగే ఈ పెట్టుబడికి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు ఉండదు. అందుకే పన్ను చెల్లించిన తర్వాత మీకు నిజంగా ఎంత ఆదాయం మిగులుతుందో కూడా లెక్కలోకి తీసుకోవాలి.

ఒక్క పథకంపైనే ఆధారపడొద్దు
చాలామంది పెట్టుబడిదారులు తమ మొత్తం పొదుపును ఒకే పథకంలో పెట్టరు. నెలవారీ ఆదాయం కోసం పీఓఎంఐఎస్‌ను ఉపయోగిస్తూనే, మిగిలిన డబ్బును బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్ల వంటి ఇతర పెట్టుబడుల్లో ఉంచుతారు. ఇలా చేస్తే ఒకవైపు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. మరోవైపు దీర్ఘకాల వృద్ధికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఈ పథకాన్ని ఒక్కటే పరిష్కారంగా కాకుండా, మొత్తం పెట్టుబడి ప్రణాళికలో భాగంగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Post Office Monthly Income Scheme
POMIS interest rate
Monthly income savings plan
Post office investment schemes
Retirement income plans India
Safe investment options

More Telugu News