ఓటమిని జీర్ణించుకోలేక.. అర్జెంటీనా ఆటగాడిపై చేయిచేసుకున్న ఇంగ్లండ్ స్టార్ బెల్లింగ్‌హామ్.. వీడియో వైర‌ల్‌!

Jude Bellingham hits Argentina player after England World Cup defeat
  • వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమితో సహనం కోల్పోయిన ఇంగ్లండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్
  • అర్జెంటీనా ఆటగాడు బార్కో తలపై చేయిచేసుకున్న వైనం
  • మ్యాచ్ ముగిసిన తర్వాత సంబరాల్లో ఈ ఘటన
  • చివరి నిమిషాల్లో రెండు గోల్స్‌తో ఇంగ్లండ్‌ను ఓడించిన అర్జెంటీనా
  • ఇది తమకు అత్యంత బాధాకరమైన రోజు అని బెల్లింగ్‌హామ్ వ్యాఖ్య
ఫిఫా ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఇంగ్లండ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ సహనం కోల్పోయాడు. తీవ్ర నిరాశ, ఆవేశంతో ప్రత్యర్థి ఆటగాడిపై చేయి చేసుకుని వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట‌ వైరల్‌గా మారింది.

నిన్న‌ జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి ఖరారైన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. రిఫరీ ఫైనల్ విజిల్ ఊదిన వెంటనే, అర్జెంటీనా ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, ఆ జట్టు ఆటగాడు వాలెంటిన్ బార్కో తలపై బెల్లింగ్‌హామ్ కొట్టాడు. దీంతో బార్కో కూడా అతడిని వెనక్కి నెట్టేశాడు. వెంటనే ఇరుజట్ల ఆటగాళ్లు జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా సద్దుమణిగేలా చేశారు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపు అంచున నిలిచింది. కానీ, ఆట చివరి 7 నిమిషాల్లో లియోనెల్ మెస్సీ అందించిన పాస్‌లతో ఎంజో ఫెర్నాండెజ్, లౌటారో మార్టినెజ్ గోల్స్ చేయడంతో అర్జెంటీనా సంచలన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఊహించని ఓటమిని జీర్ణించుకోలేక బెల్లింగ్‌హామ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. సంబరాల సమయంలో బార్కో తనను ఉద్దేశించి ఏదో వ్యాఖ్య చేయడంతో ఆవేశానికి లోనైనట్లు తెలుస్తోంది.

ఈ ప్రపంచ కప్‌లో 6 గోల్స్ చేసి అద్భుతంగా రాణించిన బెల్లింగ్‌హామ్, మ్యాచ్ అనంతరం తన ఆవేదనను వ్యక్తం చేశాడు. "ఇది మాకు, మా జట్టుకు, అభిమానులకు అత్యంత బాధాకరమైన రోజు. మేము బాగా ఆడాం, చివరి వరకు పోరాడాం. కానీ, అది సరిపోలేదు" అని మీడియాకు తెలిపాడు.
Advertisement
Jude Bellingham
FIFA World Cup 2026
Argentina vs England
Valentin Barco
Football controversy
Bellingham hits Barco

More Telugu News