తాత్కాలికంగా మూతపడ్డ ఢిల్లీలోని ఎర్రకోట
- నెల రోజుల పాటు సందర్శకులకు నో ఎంట్రీ
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో కీలక నిర్ణయం
- అధికారిక పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటను నిన్నటి నుండి ఆగస్టు 15 వరకు (నెల రోజుల పాటు) సాధారణ సందర్శకులు, ప్రజల కోసం పూర్తిగా మూసివేశారు. ఈ మేరకు భారత పురావస్తు శాఖ అధికారికంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ముందస్తు భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 15న జరిగే ఈ జాతీయ వేడుకల్లో దేశ ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, ఎర్రకోట బురుజుల నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశీ అతిథులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అందువల్ల జాతీయ వేడుకలు ముగిసే వరకు పర్యాటకులు, స్థానిక ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఆగస్టు 15 వేడుకలు ముగిసిన అనంతరం యథావిధిగా ఎర్రకోటను పర్యాటకుల సందర్శనార్థం తిరిగి తెరుస్తారు.