చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
- జాతీయ చేనేత దినోత్సవం వేళ ప్రభుత్వ కానుక
- నేతన్నకు భరోసా పథకం కింద రూ. 25 వేల ఆర్థిక సాయం
- 55 వేల మంది చేనేత కార్మికులకు నేరుగా లబ్ధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం వేళ అదిరిపోయే కానుక అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీన 'నేతన్నకు భరోసా' పథకాన్ని అమలు చేసేందుకు చేనేత, జౌళి శాఖ శరవేగంగా కసరత్తులు చేస్తోంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద ఏడాదికి రూ. 24 వేలు ఇచ్చేవారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల కష్టాలను గుర్తించి, దానికి మరో రూ. 1,000 అదనంగా జోడించి... ఈ ఏడాది నుండి రూ. 25 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో ఏకంగా రూ. 250 కోట్లను సర్కార్ కేటాయించింది.
ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి:
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55 వేల మంది అర్హులైన చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరనుంది.
సొంతంగా చేనేత మగ్గం కలిగి ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే, నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందుతుంది.
కేవలం మగ్గం ఉన్నవారికే కాకుండా... రాట్నం వడకడం, నూలుకు రంగులు అద్దడం వంటి అనుబంధ పనులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి వారు రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది వరకు ఉంటారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.