బరువు తగ్గాలనే లక్ష్యంతో చాలామంది కఠినమైన డైట్‌లు, సోషల్ మీడియా ట్రెండ్‌లను అనుసరిస్తుంటారు. అయితే అవి తాత్కాలిక ఫలితాలే ఇస్తాయని, ఆరోగ్యానికి కూడా హానికరమయ్యే అవకాశం ఉందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్, సెలబ్రిటీ డైటీషియన్ నమామి అగర్వాల్ చెబుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ఎప్పటికీ చేయకూడని నాలుగు అలవాట్లను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు.

సోషల్ లైఫ్‌కు దూరం కావొద్దు
బరువు తగ్గాలనే కారణంతో కుటుంబ వేడుకలు, స్నేహితులతో సమావేశాలను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని ఆమె సూచించారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, ఒంటరితనం పెరిగి భావోద్వేగాలతో ఎక్కువగా తినే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆకలితో ఉండొద్దు
తక్కువ సమయంలో బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ఆహారం తీసుకోవడం లేదా ఆకలితో ఉండటం సరైన మార్గం కాదని చెప్పారు. ఇలా చేస్తే శరీరంలోని జీవక్రియ (మెటబాలిజం) మందగించి, ఆకలి హార్మోన్లు పెరిగే ప్రమాదం ఉంటుందని వివరించారు.

క్యాలరీల లెక్కలకే పరిమితం కావొద్దు
బరువు నియంత్రణలో కేవలం క్యాలరీలు మాత్రమే కీలకం కావని నమామి పేర్కొన్నారు. నిద్ర, ఒత్తిడి, హార్మోన్ల సమతుల్యత, జీర్ణక్రియ, ఆహార నాణ్యత వంటి అంశాలు కూడా బరువుపై ప్రభావం చూపుతాయని తెలిపారు.

ఆహార పదార్థాలను పూర్తిగా మానేయొద్దు
వైద్యపరమైన అవసరం లేకపోతే ఏ ఆహారాన్నీ పూర్తిగా మానేయకూడదని సూచించారు. అలా చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు, ఫైబర్ తగ్గిపోవడంతో పాటు పేగుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. అన్ని రకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.

ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అంటే శరీరాన్ని శిక్షించడం కాదని, సమతుల జీవనశైలిని అలవాటు చేసుకోవడమే నిజమైన పరిష్కారమని నమామి అగర్వాల్ పేర్కొన్నారు.