కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh lays foundation stone for Dalmia Cement expansion in Kadapa district
  • ఈ విస్తరణ కోసం రూ.3,100 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న సంస్థ
  • ప్లాంట్ విస్తరణతో కొత్తగా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు
  • సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 3.6 నుంచి 9.6 మిలియన్ టన్నులకు పెంపు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు టీజీ భరత్, సవిత, పలువురు ప్రజాప్రతినిధులు
రాయలసీమ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. కడప జిల్లాలో ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ సిమెంట్ తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనుంది. జిల్లాలోని మైలవరం మండలం చిన్నకొమెర్ల వద్ద రూ.3,100 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న రెండో ప్లాంట్ (లైన్-2) విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌కు దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియా, కంపెనీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. శంకుస్థాపనకు ముందు మంత్రి, కంపెనీ ప్రాంగణంలోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో ఏర్పాటు చేసిన ఆధునిక రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. వాటి పనితీరు, సాంకేతిక పరిజ్ఞానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను, ఆడియో విజువల్ ప్రజెంటేషన్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా అక్కడి కార్మికులతో కాసేపు ముచ్చటించి, వారితో కలిసి సెల్ఫీ దిగారు. ఆ తర్వాత పునీత్ దాల్మియాతో కలిసి భూమిపూజ నిర్వహించి, ప్లాంట్ విస్తరణ పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఉత్పత్తి సామర్థ్యం మూడింతలు పెంపు
దాల్మియా సిమెంట్ ప్రస్తుతం చిన్నకొమెర్లలోని ప్లాంటులో ఏటా 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా చేపట్టిన రెండో లైన్ విస్తరణ పూర్తయితే ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. క్లింకర్ ఉత్పత్తి 6.1 మిలియన్ టన్నులకు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ఇది ప్రస్తుత సామర్థ్యంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ. భరత్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ సీహెచ్ భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. 

వీరితో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, దాల్మియా భారత్ లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేసీ బిర్లా, నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ హెడ్ గణేశ్‌ వామనరావు, ప్లాంట్ హెడ్ అర్పన్ పరేఖ్ తదితరులు హాజరయ్యారు. ఈ భారీ పెట్టుబడితో కడప జిల్లా పారిశ్రామిక రంగంలో మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Nara Lokesh
foundation stone
Dalmia Cement
Kadapa District
Andhra Pradesh

More Telugu News