విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. జులై 23న ‘జన నాయగన్‌’ విడుదల?

Vijay starrer Janayagan movie to release on July 23
  • విదేశాల్లో జులై 24 నుంచి షోలు వేస్తారని సమాచారం
  • తమిళనాడులో తొలి షో ఉదయం 9 గంటలకని టాక్‌
  • ఏపీ, తెలంగాణలో ఉదయం 5 గంటల నుంచే షోలు వేసే అవకాశం
  • చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ మంజూరు
  • విడుదలకు ముందు 12 మార్పులు సూచించిన సెన్సార్‌ బోర్డు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్‌’ విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడనున్నట్లు సమాచారం. జులై 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో మాత్రం జులై 24 నుంచి ప్రదర్శించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పినట్లు ఎన్‌డీటీవీ కథనం తెలిపింది.

తమిళనాడులో ఈ సినిమాకు ప్రత్యేకంగా ఉదయం 5 గంటల షోలు ఉండవని తెలుస్తోంది. తొలి ప్రదర్శన ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మాత్రం ఉదయం 5 గంటల నుంచే షోలు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ఈ చిత్రానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ‘ఏ’ సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. జులై 9న సర్టిఫికేషన్‌ పూర్తికాగా, సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లుగా నమోదైంది. విడుదలకు ముందు చిత్రంలో 12 మార్పులు చేయాలని సెన్సార్‌ బోర్డు సూచించగా, ఆ మార్పులు చేశాకే సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలిసింది.

హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్‌, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్‌ నటుడిగా కనిపించనున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
Vijay
Janayagan movie release date
H Vinoth
Pooja Hegde
Janayagan censor certificate
KVN Productions

More Telugu News