గెలిపించిన యువతే ఇప్పుడు రోడ్డెక్కింది.. నేపాల్ ప్రభుత్వంపై జెన్‌జీ ఆగ్రహం

Balendra Shah government faces Gen Z protests as youth take to streets
  • 25 ఏళ్ల యువకుడి ఆత్మాహత్యతో నేపాల్‌లో భారీ నిరసనలు
  • బాలేంద్ర షా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జెన్‌జీ యువత
  • పేదలపై దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు ఆపాలని డిమాండ్
  • మున్సిపల్ పోలీసుల అధికార దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు
  • చట్టం ఇవ్వని అధికారాలను వినియోగిస్తున్నారని న్యాయ నిపుణుల ఆరోపణలు
నేపాల్‌లో 25 ఏళ్ల రైడ్‌షేరింగ్ డ్రైవర్ గణేశ్ మృతి దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. గత వారం ఖాట్మండులో కస్టమర్ కోసం వేచి ఉన్న సమయంలో పోలీసులు అతని మోటార్‌సైకిల్‌కు వీల్ లాక్ వేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనతో ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. కొన్ని నెలల క్రితమే యువత మద్దతుతో భారీ మెజారిటీ గెలుపొందిన బాలేంద్ర షా ప్రభుత్వంపై ఇప్పుడు అదే జెన్‌జీ తరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మార్పు కోసం నిలిచిన యువతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని జవాబుదారీతనం కోరుతూ వీధుల్లోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆదివారం వందలాది మంది సింగ్‌దర్బార్ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ‘పేదలపై దౌర్జన్యాలు ఆపండి’, ‘మానవ హక్కులను గౌరవించండి’ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, నిర్వాసితులకు ఆశ్రయం కల్పించాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మార్చాలని డిమాండ్ చేశారు.

మీడియా కథనాల ప్రకారం, బాలేంద్ర షా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాట్మండు మున్సిపల్ పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, అనధికార వీధి వ్యాపారుల తొలగింపు, నదీతీర ప్రాంతాల్లోని నివాసాలను ఖాళీ చేయించే చర్యల్లో కఠిన వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యల సందర్భంగా అనేకసార్లు ఘర్షణలు చోటుచేసుకోవడంతో పేదల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించడం లేదనే అభిప్రాయం బలపడింది.

ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మున్సిపల్ పోలీస్ చట్టం-2023 బాలేంద్ర షా హయాంలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మున్సిపల్ పోలీసుల బాధ్యతలు నగర ఆస్తుల రక్షణ, పారిశుద్ధ్య పర్యవేక్షణ, పార్కుల సంరక్షణ, స్థానిక ఉత్సవాల నిర్వహణకు సహకరించడం వరకే పరిమితమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. లాఠీచార్జ్ చేయడం లేదా ప్రజలను అదుపులోకి తీసుకునే అధికారం వారికి లేదని పేర్కొంటున్నారు.

అయినప్పటికీ, బాలేంద్ర షా ప్రభుత్వంలో మున్సిపల్ పోలీసులు రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులపై తరచూ బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు గణేశ్ మృతి ఆ అసంతృప్తికి మరింత ఆజ్యం పోసి నేపాల్‌లో మరోసారి భారీ నిరసనలకు కారణమైంది.
Advertisement
Balendra Shah
Kathmandu Protests
Nepal Driver Death
Gen Z Nepal
Kathmandu Municipal Police
Nepal Government Accountability

More Telugu News