కర్ణాటకలో 22 ఏళ్లుగా అక్రమ నివాసం.. పాకిస్థాన్‌కు చెందిన తల్లి, కొడుకు అరెస్ట్

Farhanaz and son arrested for living illegally in Karnataka for 22 years
  • నకిలీ పత్రాలతో ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల సృష్టి
  • రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేయడంతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
  • భారత వ్యక్తిని వివాహం చేసుకుని పాకిస్తాన్ నుంచి వచ్చిన మహిళ
కర్ణాటకలో గత 22 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయులైన తల్లి, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి తాలూకాలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీసా గడువు ముగిసినప్పటికీ దేశం విడిచి వెళ్లకుండా, నకిలీ పత్రాలు ద్వారా భారత ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు.

బాగేపల్లి సమీపంలోని దాసగరిపల్లి గ్రామంలో నివసిస్తున్న ఫర్హానాజ్ (52), ఆమె కుమారుడు మహమ్మద్ ఫర్దీన్ (21) రేషన్ కార్డు పొందడంతో పాటు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వారు సమర్పించిన పత్రాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులకు అనుమానం కలగడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో వారు భారత పౌరసత్వం లేని పాకిస్థాన్ జాతీయులని నిర్ధారణ అయింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ జాతీయురాలైన ఫర్హానాజ్‌కు, దాసగరిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అయూబ్ ఖాన్‌తో 2003లో వివాహం జరిగింది. వీరి కుమారుడు ఫర్దీన్ పాకిస్థాన్‌లోనే జన్మించాడు.

అనంతరం కొన్నాళ్లకు ఈ కుటుంబం భారత్‌లో స్థిరపడింది. అయితే, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లకుండా, బెంగళూరు చిరునామాలను ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బ్యాంకు ఖాతాలు కూడా పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తల్లికొడుకులను అరెస్టు చేశారు. ఈ నకిలీ పత్రాల జారీ వెనుక ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Advertisement
Farhanaz
Muhammad Fardeen
Karnataka police
Illegal Pakistani residents
Chikkaballapur
Fake Indian documents

More Telugu News