ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ 'విడా' కింద మరో కొత్త స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అధిక రేంజ్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ‘విడా VX2 ప్లస్ 4.4 kWh’ వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్కూటర్ 187 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర (న్యూఢిల్లీ) రూ. 1.44 లక్షలుగా నిర్ణయించారు.

ఈ కొత్త స్కూటర్‌లో 2.2 kWh సామర్థ్యం గల రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అమర్చారు. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. కేవలం 3.1 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పోర్టబుల్ చార్జర్‌తో సుమారు 3 గంటల 30 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. అదే డీసీ ఫాస్ట్ చార్జర్‌తో అయితే కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.

ఫీచర్ల విషయానికొస్తే... ఇందులో 27.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, డిస్క్, డ్రమ్ బ్రేక్స్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) మోడల్‌లో కూడా దీన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఇంట్లోనే బ్యాటరీలను చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల రేంజ్ గురించిన ఆందోళన తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ జులై చివరి నుంచి విడా డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ స్కూటర్ సిరీస్ సుదీర్ఘ ప్రయాణం చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించినట్లు కంపెనీ గుర్తుచేసింది.