పక్కా వ్యూహాలతో రేవంత్ రెడ్డి వేగం పెంచారు: జగ్గారెడ్డి

Revanth Reddy has increased speed with perfect strategies says Jagga Reddy
  • రేవంత్ తీసుకునే నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్న జగ్గారెడ్డి
  • వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడి
  • తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ఎక్కడి చెప్పలేదన్న జగ్గారెడ్డి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాలతో వేగం పెంచారని, ఆయన నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో చురుగ్గా లేని ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ఇప్పటికే అప్రమత్తం చేశారన్నారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేసేలా 117 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.


తన రాజకీయ భవిష్యత్తు, సంగారెడ్డి నియోజకవర్గంపై వస్తున్న ప్రచారానికి జగ్గారెడ్డి గట్టిగా జవాబిచ్చారు. తాను కేవలం సంగారెడ్డి నుంచి పోటీ చేయనని మాత్రమే అన్నానని, అంతేకానీ ఎన్నికల బరి నుంచే తప్పుకుంటానని ఎక్కడా చెప్పలేదన్నారు. భవిష్యత్తులో సంగారెడ్డి స్థానం మహిళలకు కేటాయించినా, లేదా సాధారణ స్థానంగా ఉన్నా సరే.. అక్కడ నుంచి తన అర్ధాంగి నిర్మలనే అభ్యర్థిగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. విపక్షాల విమర్శలు, సర్వేలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలకు కూడా జగ్గారెడ్డి హితవు పలికారు. గతంలో కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల పనితీరుపై ఇలాంటి సర్వేలే వచ్చాయని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఎవరూ ఎప్పటికీ శాశ్వత వీరులు కారని, తామే గొప్ప అనుకుంటే సాగదన్నారు. ముఖ్యమంత్రి హెచ్చరించిన తర్వాత కూడా తీరు మార్చుకోని ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలో లేదో ముఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానం మాత్రమే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.

Advertisement
Revanth Reddy
Jagga Reddy
Telangana Congress
Telangana Elections
Sangareddy Constituency
Congress 117 seats target

More Telugu News