"పల్లి పల్లి మినిస్టర్".. విజయవంతంగా ముగిసిన మంత్రి లోకేశ్‌ కొరియా పర్యటన

Nara Lokesh South Korea visit concludes successfully with focus on investments for AP
  • వారం రోజుల్లో 50కి పైగా కంపెనీలతో పెట్టుబడుల కోసం చర్చలు
  • ఎల్జీ, హ్యుందాయ్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థల సానుకూల స్పందన
  • బుసాన్‌లో ఏపీ పెట్టుబడిదారుల సహాయక కేంద్రాన్ని ప్రారంభించిన లోకేష్
  • లోకేశ్‌ వేగాన్ని చూసి 'పల్లి పల్లి' (త్వరగా త్వరగా) మంత్రి అని ప్రశంసించిన కొరియన్లు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ చేపట్టిన వారం రోజుల దక్షిణ కొరియా పర్యటన అద్భుతరీతిలో విజయవంతమైంది. భారత్-కొరియా మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే క్రమంలో ఈ పర్యటన ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5 నుంచి 11 వరకు సాగిన ఈ పర్యటనలో మంత్రి లోకేశ్‌, ఆయన బృందం అక్కడి ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల నుంచి విశేష గౌరవాన్ని అందుకుంది.

50కి పైగా కంపెనీలతో కీలక చర్చలు
ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ 50కి పైగా కార్పొరేట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎల్జీ, హ్యుందాయ్, శాంసంగ్, బీఎన్‌కే ఫైనాన్షియల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. 

ముఖ్యంగా ఎల్జీ సంస్థ తమ ప్రధాన కార్యాలయానికి లోకేశ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి, ఉన్నత స్థాయి బృందంతో గౌరవ విందు ఇవ్వడం ఈ పర్యటనకు లభించిన ప్రాధాన్యతను చాటుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై లోకేశ్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌కు కొరియన్ కంపెనీల నుంచి అద్భుత స్పందన లభించింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తమ ఉన్నత యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయా సంస్థలు హామీ ఇచ్చాయి.

బుసాన్‌లో ‘అపెక్స్-కొరియా’ సెల్ ప్రారంభం
పెట్టుబడిదారులకు మరింత చేరువయ్యేందుకు, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కొరియాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్‌లో మంత్రి లోకేశ్‌ ‘అపెక్స్-కొరియా' (ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌టర్నల్ ఎంగేజ్‌మెంట్-కొరియా) కేంద్రాన్ని ప్రారంభించారు. ఏపీఈడీబీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియన్ కంపెనీలకు ఒక వారధిగా పనిచేస్తుంది. 

ఇప్పటికే శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో 40కి పైగా కొరియన్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతో మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. పర్యటన ప్రారంభంలో సియోల్‌లోని భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో భేటీ అయిన లోకేశ్‌, కొరియాలోని కీలక పరిశ్రమలను ఏపీకి తీసుకురావడంలో చొరవ చూపాలని కోరారు.

‘పల్లి పల్లి’ మినిస్టర్ అంటూ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో ‘కియా’ మోటార్స్ కేవలం రెండేళ్లలో సాధించిన అసాధారణ విజయాన్ని లోకేశ్‌ తన ప్రసంగాల్లో ఉదహరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘3ఎస్’ మోడల్ (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్), వేగవంతమైన అనుమతుల విధానం కొరియన్లను అమితంగా ఆకట్టుకుంది. మంత్రి లోకేశ్‌ పని వేగాన్ని, చొరవను చూసి ముగ్ధులైన కొరియన్ ప్రతినిధులు ఆయన్ను ‘పల్లి.. పల్లి మంత్రి’ అని ముద్దుగా పిలుచుకున్నారు. కొరియన్ భాషలో ‘పల్లి పల్లి’ అంటే ‘త్వరగా త్వరగా’ అని అర్థం. 

లోకేశ్‌ బృందం పర్యటన అద్భుతమని కొరియా వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (కోట్రా) దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్‌హూన్ కిమ్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Investments
South Korea Visit
APEX Korea Busan
LG Hyundai Samsung AP
Kia Motors Andhra Pradesh

More Telugu News