హాలిడే ట్రిప్ పేరిట స్విట్జర్లాండ్ వెళ్లిన హైదరాబాద్ బిజినెస్‌మెన్ దంపతుల మాయం: రూ. 50 కోట్ల కుంభకోణం కోణంలో పోలీసుల దర్యాప్తు!

Hyderabad businessman couple missing in Switzerland during holiday trip as police probe 50 crore scam
  • స్విట్జర్లాండ్ వెళ్లిన చంద్రశేఖర్, స్వప్న దంపతులు
  • అక్కడకు వెళ్లిన తర్వాత ఫోన్ కమ్యూనికేషన్ కట్
  • కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఇన్వెస్టర్ల నుంచి రూ. 50 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు 

హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త, ఆయన భార్య సుమారు మూడు వారాల క్రితం స్విట్జర్లాండ్‌కు విహారయాత్రకు వెళ్లి అక్కడ అదృశ్యమవడం నగరంలో కలకలం రేపుతోంది. అయితే, వీరు నిజంగానే తప్పిపోయారా? లేక ఇన్వెస్టర్ల నుండి భారీగా వసూలు చేసిన సొమ్ముతో విదేశాలకు చెక్కేశారా? అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.


వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌కు చెందిన పబ్బా చంద్రశేఖర్ (51) అనే బిజినెస్‌మెన్, ఆయన భార్య స్వప్న (42) జూన్ 22న స్విట్జర్లాండ్ హాలిడే ట్రిప్‌కు వెళ్లారు. ప్రారంభంలో కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్న ఈ దంపతులు, జులై 8వ తేదీ నుండి పూర్తిగా కమ్యూనికేషన్ కట్ చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన వారి కుమార్తె, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన శ్రేయ (23) పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.


మరోవైపు, ఈ మిస్సింగ్ వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం ఊపందుకుంది. చంద్రశేఖర్ దంపతులు గత కొన్నేళ్లుగా దాదాపు 60 మందికి పైగా ఇన్వెస్టర్ల నుండి ఆకర్షణీయమైన రిటర్న్స్ ఇస్తామని నమ్మించి, వివిధ వ్యాపార అవసరాల నెపంతో దాదాపు రూ. 50 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ డబ్బుతోనే వీరు ప్లాన్ ప్రకారం దేశం దాటారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.


ప్రస్తుతానికి పోలీసుల నుంచి చీటింగ్ కేసులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సదరు దంపతుల ట్రావెల్ ప్లాన్స్, ఇమ్మిగ్రేషన్ రికార్డులతో పాటు వారి బ్యాంక్ ఫైనాన్షియల్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరు నిజంగానే స్విట్జర్లాండ్ వెళ్లారా? లేక వేరే దేశానికి రూట్ మర్చారా? అనేది తేలాల్సి ఉంది. ఈ దంపతుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

Advertisement
Pabba Chandrashekhar
Hyderabad businessman missing
Switzerland holiday trip scam
50 crore investment fraud
Pabba Chandrashekhar Swapna missing case
Telangana police investigation

More Telugu News