జయపూర్ మర్డర్ కేసులో సంచలన మలుపు.. తల్లిని చంపిన కూతురే ఏడాది క్రితం తండ్రిని కూడా లేపేసిందా?

Ayushi Sharma Jaipur murder case twist suspected of killing father after mother
  • జయపూర్‌లో తల్లిని కారుతో ఢీకొట్టి చంపిన కేసులో కొత్త ట్విస్ట్
  • ఏడాది క్రితం మరణించిన తండ్రిది కూడా హత్యేనని ఆరోపణలు
  • కూతురు ఆయుషే ఇద్దరినీ చంపిందంటూ మేనమామ ఫిర్యాదు
  • నాన్న ఫీడింగ్ ట్యూబ్ తీసి చంపేశానని తల్లిని బెదిరించిన కూతురు
  • తండ్రి మృతిపైనా విచారణ ప్రారంభించిన పోలీసులు
రాజస్థాన్ రాజధాని జయపూర్‌లో కుదిపేసిన నీరజ్ శర్మ హత్య కేసులో వెన్నులో వణుకుపుట్టించే వాస్తవాలు బయటపడుతున్నాయి. తల్లిని కారుతో తొక్కించి చంపిందన్న ఆరోపణలతో అరెస్టయిన ఆమె కూతురు ఆయుషి శర్మ.. ఏడాది క్రితం తన తండ్రిని కూడా పక్కా ప్రణాళికతో హత్య చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

జయపూర్‌లోని ప్రతాప్ నగర్‌లో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ)గా పనిచేస్తున్న నీరజ్ శర్మను ఈ నెల 3న ఒక స్కార్పియో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పోలీసులు దర్యాప్తులో అసలు నిజాన్ని నిగ్గుతేల్చారు. ఆస్తి గొడవలు, ఇతర కారణాలతో ఆమె 23 ఏళ్ల కూతురు ఆయుషి శర్మే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చి అరెస్ట్ చేశారు.

ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆయుషి మేనమామ రాకేష్ శర్మ రంగంలోకి దిగారు. ఏడాది క్రితం (2025 ఏప్రిల్‌లో) మరణించిన ఆయుషి తండ్రి విజయ్ శర్మది సహజ మరణం కాదని, అది కూడా ఆయుషి చేసిన హత్యేనంటూ పోలీసులకు, కోర్టుకు ఫిర్యాదు చేశారు. బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతూ కోలుకుంటున్న తన తండ్రికి ఆయుషి సరైన వైద్యం అందకుండా చేసిందని రాకేష్ ఆరోపించారు. మెరుగైన వైద్యం పేరుతో తన కజిన్ బలరామ్‌తో కలిసి తండ్రిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి, మూడు నెలల పాటు బంధించిందని, చివరకు పరిస్థితి విషమించాక ఆసుపత్రిలో చేర్పించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఒకసారి గొడవ జరిగినప్పుడు... ‘నాన్నకు అమర్చిన ఫీడింగ్ ట్యూబ్ తీసేసి ఎలా చంపానో చూశావుగా, నిన్ను చంపడం ఇంకా సులువు’ అని ఆయుషి తన తల్లిని బెదిరించింది" అని రాకేష్ శర్మ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ భయంతోనే నీరజ్ శర్మ చనిపోవడానికి రెండు రోజుల ముందు "తాను బతకడానికి రెండు రోజులే సమయం ఉంది" అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు.

పోలీసుల విచారణలో ఆయుషి పలు విషయాలు అంగీకరించింది. దివ్యాంగుడైన తమ్ముడిపై తల్లి ఎక్కువ ప్రేమ చూపించడం, తనను నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్నప్పటి నుంచే తల్లిపై ద్వేషం పెంచుకున్నట్లు తెలిపింది. ఆస్తి వివాదాలు కూడా తోడవడంతోనే ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు ఒప్పుకుంది. ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్న ఆయుషి, చట్టాలపై అవగాహనతో తెలివిగా వ్యవహరిస్తోందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయుషి కజిన్ బలరామ్ కోసం గాలిస్తున్నామని, విజయ్ శర్మ మృతిపై వచ్చిన ఆరోపణలను కూడా ప్రస్తుత దర్యాప్తులో కలిపి విచారిస్తామని డీసీపీ రంజితా శర్మ వెల్లడించారు. ఈ విచారణ పూర్తయితే ఆయుషిపై మరిన్ని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
Advertisement
Ayushi Sharma
Jaipur murder case
Neeraj Sharma
Vijay Sharma
Rajasthan crime
Property dispute murder

More Telugu News