ఒకే స్క్రిప్ట్‌తో... ఆ ముగ్గురూ పవన్‌ను టార్గెట్ చేశారు: మంత్రి కందుల దుర్గేశ్

Minister Kandula Durgesh says three people targeted Pawan Kalyan with a single script
  • పవన్‌ను లక్ష్యంగా చేసుకుని జడా శ్రావణ్, ప్రకాశ్ రాజ్, రావణ్ కుట్ర అంటూ మంత్రి ఫైర్
  • వీరి వెనుక వైసీపీ, తాడేపల్లి స్క్రిప్ట్ ఉందని కందుల దుర్గేశ్ ఆరోపణ
  • జగన్‌పై పోరాటానికి రూ. 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో శ్రావణ్ చెప్పాలని డిమాండ్
  • ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారని ఫైర్
  • ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమేనా అని తీవ్ర విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైసీపీ భారీ కుట్రకు తెరలేపిందని, అందులో భాగంగానే జడా శ్రావణ్ కుమార్, నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పనిచేస్తున్నారని రాష్ట్ర మంత్రి, జనసేన నేత కందుల దుర్గేశ్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ముగ్గురూ తాడేపల్లి నుంచి వస్తున్న ఒకే స్క్రిప్ట్‌ను అమలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేధావుల ముసుగులో వీరు చేస్తున్న ప్రయత్నాలు, వైఎస్ జగన్‌తో జడా శ్రావణ్ భేటీ కావడంతో బట్టబయలయ్యాయని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్, జడా శ్రావణ్‌ను లక్ష్యంగా చేసుకుని పలు సూటి ప్రశ్నలు సంధించారు. "జగన్‌పై పోరాటానికి రూ. 25 కోట్లు సొంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పిన శ్రావణ్‌కు అంత సొమ్ము ఎలా వచ్చిందో చెప్పాలి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, తక్కువ కాలం జడ్జిగా పనిచేసి, తర్వాత సాధారణ న్యాయవాదిగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి అంత డబ్బు ఎలా వస్తుంది? మాకు తెలిసిన సమాచారం ప్రకారం, అవినీతి కేసుల్లో ఉండటం వల్లే ఆయన జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే, సుగాలి ప్రీతి తల్లిని మోసం చేసిన మాట వాస్తవం కాదా?" అని దుర్గేశ్ నిలదీశారు. 

పవన్ కల్యాణ్ ఏనాడూ శ్రావణ్ ప్రస్తావన తేకపోయినా, కేవలం వైసీపీ ఆదేశాలతోనే శ్రావణ్ పదేపదే పవన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

జోసెఫ్ రావణ్, శ్రావణ్, ప్రకాశ్ రాజ్‌ల మధ్య ఉన్న 'క్యాష్ బంధం' ఏంటో బయటపెట్టాలని దుర్గేశ్ డిమాండ్ చేశారు. "రావణ్‌ను అరెస్ట్ చేస్తే శ్రావణ్ ఎందుకు అంతగా ఇబ్బంది పడుతున్నారు? ప్రశ్నించే హక్కు అంటే బూతులు తిట్టడమేనా? వ్యక్తిత్వ హననం చేసేవారిని వెనకేసుకు రావడమేనా మీ పని?" అని ప్రశ్నించారు. ఈ ముగ్గురూ కలిసి ఏపీలో క్రైస్తవులను రెచ్చగొట్టి మతాల మధ్య ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీని వెనుక వైసీపీ ఎజెండా స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు.

ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడుతూ, "కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంపై, అక్కడి ఆచారాలపై ఆయన చేసిన విమర్శలు అందరికీ తెలుసు. ఆ కుట్ర కేసులో అరెస్ట్ అయిన చిన్నయ్య అనే వ్యక్తి, ప్రకాశ్ రాజ్ చీకటి కోణాన్ని బయటపెట్టాడు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికే ప్రకాశ్ రాజ్ ఏపీలో ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు" అని దుర్గేశ్ ఆరోపించారు.

పవన్ కల్యాణ్ ఆదాయంపై శ్రావణ్ చేస్తున్న విమర్శలను దుర్గేశ్ తిప్పికొట్టారు. "ఒక పెద్ద హీరో సినిమా పూర్తికావడానికి రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. 2024 ఎన్నికల అఫిడవిట్‌లో పవన్ తన ఆదాయ వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. అయినా కొత్త వాదనలు తేవడం విడ్డూరం. పవన్‌ను ఒక కులానికో, మతానికో పరిమితం చేయాలని, సనాతన ధర్మంపై దుర్మార్గపు మాటలు మాట్లాడాలని వీరందరికీ తాడేపల్లి నుంచే స్క్రిప్ట్ వస్తోంది" అని దుర్గేశ్ విమర్శించారు. 

రోజురోజుకీ బలోపేతం అవుతున్న కూటమి ప్రభుత్వాన్ని బలహీనపరిచి, అస్థిరపరచడమే వీరి ఏకైక ధ్యేయమని ఆరోపించారు. ఈ కుట్రను తాము తప్పనిసరిగా ఎదుర్కొంటామని, ప్రజా క్షేత్రంలో వారి ముసుగు తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Kandula Durgesh
Pawan Kalyan
Jada Shravan Kumar
Prakash Raj
Andhra Pradesh Politics
YSRCP Conspiracy

More Telugu News