జేఎన్టీయూ స్నాతకోత్సవం విజయనగరంలోనే జరపాలి: గవర్నర్‌కు బొత్స లేఖ
- జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం వేదికను మార్చొద్దన్న బొత్స
- విజయనగరం జిల్లాలోనే నిర్వహించాలని గవర్నర్‌కు విన్నపం
- విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో నిర్వహించాలనుకోవడం సరికాదని వ్యాఖ్య
విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం వేదికను మార్చాలన్న నిర్ణయంపై ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో కాకుండా విజయనగరంలోనే నిర్వహించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఆయన ఒక లేఖ రాశారు.
స్నాతకోత్సవానికి తనను ఆహ్వానించినందుకు గవర్నర్ కు బొత్స ధన్యవాదాలు తెలిపారు. "విజయనగరం లాంటి వెనుకబడిన జిల్లాలో విద్యా రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు సంబంధించిన మొట్టమొదటి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో జరపడమే అత్యంత సముచితం.
ఈ అట్టహాస వేడుకను విజయనగరంలో కాకుండా, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాలని అనుకోవడం సరికాదు. ఈ నిర్ణయం వల్ల విజయనగరం జిల్లా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అక్కడ ఈ వేదిక మార్పుపై తీవ్ర నిరసనలు, తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజల, విద్యార్థుల ఆకాంక్షలు, ఆనందాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి, విజయనగరం జిల్లా వాసుల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని, యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరంలోనే నిర్వహించేలా ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించండి" అని తన లేఖ ద్వారా బొత్స కోరారు.