'అన్న రాజ్యం' కాదు.. 'అక్క రాజ్యం' ఎలా ఉంటుందో చూపిస్తా: కవిత

Kavitha Says I Will Show What Akka Rajyam Is Not Anna Rajyam
  • తమ ప్రభుత్వం వస్తే రైతును రాజును చేస్తానన్న కవిత
  • పాంచజన్యం అనే నినాదంతో ముందుకు సాగుతామని వెల్లడి
  • గిరిజనుల హక్కుల సాధన కోసమే పార్టీ పెట్టానన్న కవిత

తెలంగాణ రక్షణ సేన ఎన్నికల్లో విజయం సాధిస్తే 'అన్న రాజ్యం' కాదు.. 'అక్క రాజ్యం' ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతును నిజమైన రాజును చేస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతులకు ప్రత్యేక గౌరవ కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఒక వినూత్న ఆలోచన చేశామని... త్వరలోనే దాని వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. 'పాంచజన్యం' అనే నినాదంతో మార్పు కోసం ముందుకు సాగుతామని పేర్కొన్నారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కొత్త గంగారం తదితర ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కవిత, స్థానికుల జీవన విధానాన్ని, సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వెనకబడిన గిరిజనుల హక్కుల సాధన కోసమే తాను తెలంగాణ రక్షణ సేనను స్థాపించానని, ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు.


1950 రికార్డుల్లో నాయకపోడు తెగ పేరు లేకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కుల సాధనకై అవసరమైతే ఢిల్లీ వేదికగా పోరాడతామన్నారు. కార్పొరేట్ శక్తుల వేల కోట్ల అప్పులు మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం... ఆదివాసి బిడ్డలు బైక్ కొందామన్నా బ్యాంక్ లోన్లు ఎందుకు ఇవ్వడం లేదని కవిత నిలదీశారు. విదేశాల తరహాలోనే ఇక్కడి గిరిజనులకు కూడా రూ.2 లక్షల నుండి రూ.2 కోట్ల వరకు సులభంగా లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించిన ఆమె, ఆదివాసి పిల్లలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం వారి ప్రాథమిక హక్కు అని గుర్తుచేశారు. ఏది సాధించాలన్నా ముందు ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని... అందరి సహకారం తనకు కావాలని కోరారు.

Advertisement
Kavitha
Telangana Rakshana Sena
Akka Rajyam
Tribal Rights Telangana
Bhadradri Kothagudem
Farmer Welfare

More Telugu News