ఆహారం మాత్రమే కాదు.. 100 ఏళ్లకు పైగా జీవించే వారిలో ఒక ప్రత్యేక లక్షణం!

Centenarians in Blue Zones share unique personality traits for long life
  • 100 ఏళ్లు జీవించడంలో వ్యక్తిత్వం కూడా కీలకమన్న అధ్యయనం
  • ఇటలీలోని సార్డీనియాలో పరిశోధన నిర్వహణ
  • 125 మంది వృద్ధులపై అధ్యయనం
  • కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తింపు
  • హాబీలు, మానసిక చురుకుదనం అధికంగా ఉన్నట్లు వెల్లడి
  • బాధ్యతాయుత వ్యక్తుల్లో జీవిత సంతృప్తి ఎక్కువ
ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే మంచి ఆహారం, వ్యాయామం, సామాజిక సంబంధాలే ముఖ్యమని చాలామంది భావిస్తారు. అయితే 100 ఏళ్ల వరకు జీవించే వారిలో మరో కీలక అంశం కూడా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. అది వ్యక్తిత్వమని పరిశోధకులు చెబుతున్నారు.

ఇటలీలోని సార్డీనియా ప్రాంతంలో ఈ పరిశోధన జరిగింది. ప్రపంచంలో ఎక్కువ మంది శతాధిక వయస్కులు నివసించే ‘బ్లూ జోన్స్‌’లో ఈ ప్రాంతం ఒకటి. అక్కడి 71 నుంచి 101 ఏళ్ల మధ్య వయసున్న 125 మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో 55 మంది బ్లూ జోన్‌కు చెందినవారు. మిగిలిన 70 మంది సమీప ప్రాంతాల వారు.

పాల్గొన్న వారిపై శారీరక, మానసిక ఆరోగ్యం, జీవనశైలి, అభిరుచులు, వ్యక్తిత్వ లక్షణాలపై పరీక్షలు నిర్వహించారు. ఈ పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది. బ్లూ జోన్‌లో ఉన్నవారికి ఆరోగ్య పరంగా పెద్ద తేడా కనిపించకపోయినా.. వ్యక్తిత్వంలో మాత్రం స్పష్టమైన ప్రత్యేకత కనిపించింది.

కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, కొత్త అనుభవాలను స్వీకరించే మనస్తత్వం, నిరంతరం నేర్చుకోవాలనే తపన బ్లూ జోన్‌ ప్రజల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాన్ని ‘ఓపెన్‌నెస్‌’గా పరిశోధకులు పేర్కొన్నారు.

అంతేకాదు, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, భావోద్వేగాలను నియంత్రించే నైపుణ్యం కూడా వీరిలో ఎక్కువగా కనిపించింది. మానసికంగా లేదా శారీరకంగా చురుగ్గా ఉంచే హాబీలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు పరిశోధనలో తేలింది.

అధ్యయనంలో మరో విషయం కూడా వెల్లడైంది. కొత్త విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉన్నవారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో పాటు హాబీల్లో చురుగ్గా పాల్గొనే అలవాటు కనిపించింది. బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తులు జీవితంపై ఎక్కువ సంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు ఆందోళన, నెగెటివ్‌ ఆలోచనలు ఎక్కువగా ఉండే వ్యక్తుల్లో ఆరోగ్య సంబంధిత జీవన నాణ్యత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

అయితే వ్యక్తిత్వం ఒక్కటే ఎక్కువ కాలం జీవించడానికి కారణమని ఈ అధ్యయనం చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. కానీ వ్యక్తిత్వం మన అలవాట్లు, జీవనశైలిని ప్రభావితం చేస్తుందని, అదే ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై మరింత లోతైన పరిశోధనలు అవసరమని తెలిపారు.
Advertisement
Centenarians
Longevity secrets
Blue Zones study
Healthy aging personality
Sardinia research
Openness and long life

More Telugu News