విశాఖలో జీసీసీ, మూలపేటలో నాఫ్తా క్రాకర్.. ఏపీలో పెట్టుబడులకు ఎల్జీకి మంత్రి లోకేశ్‌ ఆహ్వానం

Nara Lokesh invites LG to invest in GCC at Vizag and Naptha Cracker at Mulapeta
  • దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్‌
  • ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్ ఉన్నతాధికారులతో సమావేశం
  • విశాఖలో జీసీసీ, మూలపేటలో నాఫ్తా క్రాకర్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • శ్రీసిటీలో రూ.5000 కోట్లతో ఎల్జీ యూనిట్.. ఈ ఏడాది నుంచే ఉత్పత్తి
  • ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చిన ఎల్జీ యాజమాన్యం
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో సియోల్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, శ్రీసిటీ, మూలపేట కేంద్రాలుగా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు గల అవకాశాలను ఆయన వివరించి, పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.

విశాఖలో జీసీసీ.. ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు లోకేశ్ ప్రతిపాదనలు 
సియోల్‌లోని ఎల్జీ ట్విన్ టవర్స్‌లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్, ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్‌లతో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్జీ సంస్థ తన నోయిడా, బెంగళూరు ప్రాజెక్టుల తరహాలో విశాఖపట్నంలో ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) లేదా ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు శ్రీసిటీ, దాని పరిసర ప్రాంతాలలో డిస్‌ప్లే మాడ్యూల్స్, సెన్సర్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి విడిభాగాల తయారీ యూనిట్‌ను స్థాపించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. 

రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు ఐఓటీ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక రంగాలలో ఇన్నోవేషన్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రీసెర్చ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్‌)తో కలిసి పనిచేయాలని సూచించారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య అవసరాల కోసం చిల్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ సమావేశంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత రిఫ్రిజిరేటర్ మార్కెట్‌లో 28 శాతం, వాషింగ్ మెషీన్ల విభాగంలో 33.5 శాతం వాటాతో ఎల్జీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటికే శ్రీసిటీలో రూ.5,000 కోట్ల భారీ వ్యయంతో తమ మూడో ఉత్పాదక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, దీని ద్వారా సుమారు 1,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా ఈ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించి ఏసీ కంప్రెసర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తయారు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మూలపేటలో నాఫ్తా క్రాకర్.. ఎల్జీ కెమ్‌కు ఆహ్వానం 
పర్యటనలో భాగంగా లోకేశ్‌, ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యున్-జు కోహ్ బృందంతో కూడా భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టైరిన్ తయారీ కేంద్రాన్ని, మూలపేట పోర్టు కేంద్రంగా ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్, సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు మూలపేటలో బయో-ఇథనాల్, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్‌) ఉత్పత్తిపై దృష్టి సారించి జీవ ఇంధనాల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చేందుకు రీసైక్లింగ్, పైరోలిసిస్ ప్లాంట్లను ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీనికి యున్-జు కోహ్ స్పందిస్తూ, గతంలో విశాఖపట్నం గోపాలపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ ద్వారా కీలకమైన పాలిమర్ భాగాలను సరఫరా చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం శ్రీసిటీలో ఏబీఎస్ కాంపౌండ్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నూతన ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశాలు రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా సానుకూల వాతావరణాన్ని సృష్టించాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Nara Lokesh
LG Electronics
Andhra Pradesh Investment
Visakhapatnam GCC
Mulapeta Naptha Cracker
LG Chem South Korea

More Telugu News