బాధితుల్లాగే సినిమాను కూడా ఎన్‌కౌంటర్ చేయకండి: 'సత్లుజ్' నిషేధంపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

  • బలవంతపు ఎన్‌కౌంటర్ల కథాంశంతో తెరకెక్కిన 'పంజాబ్ 95'
  • ఏకంగా 127 కట్స్ ను ప్రతిపాదించిన సెన్సార్ బోర్డు 
  • ‘సత్లుజ్’ అనే మరో పేరుతో నేరుగా ఓటీటీలో విడుదల  

బాలీవుడ్ నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్లుజ్’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా దర్శకుడు హనీ ట్రెహాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1995 నాటి బలవంతపు ఎన్‌కౌంటర్ల కథాంశంతో మొదట ‘పంజాబ్ 95’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ ప్రతిపాదించింది. 


దీంతో మేకర్స్ థియేటర్ విడుదలను కాదని... ఎలాంటి కోతలు లేకుండా ‘సత్లుజ్’ అనే మరో పేరుతో జులై 3న నేరుగా ‘జీ5’ ఓటీటీలో విడుదల చేశారు. అయితే ఐటీ రూల్స్ ఉల్లంఘనలు, భద్రతా కారణాలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కేవలం రెండు రోజులకే ఈ సినిమాను ప్లాట్‌ఫామ్ నుండి అకస్మాత్తుగా తొలగించారు. ప్రస్తుతం ఇది భారత్ వెలుపల మాత్రమే అందుబాటులో ఉంది.


ఈ నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సత్లుజ్’ కేవలం సినిమా మాత్రమే కాదని, మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాన్ని గుర్తుచేస్తూ ఎన్నటికీ మానని లోతైన గాయాన్ని ప్రజలకు చూపుతుందని చెప్పారు. 


ఇందులో దిల్జీత్ దోసాంజ్ ఎటువంటి హీరోయిజం చూపించకుండా, కేవలం తన అంతరాత్మను ఆయుధంగా చేసుకుని అద్భుతంగా నటించారని కొనియాడారు. అలాగే కుళ్ళిపోయిన సమాజానికి అద్దం పడుతూ అర్జున్ రాంపాల్ పోషించిన పోలీస్ పాత్ర అత్యంత భీతిగొలిపేలా, సహజంగా ఉందన్నారు. దర్శకుడు హనీ ట్రెహన్ ఈ భయానక వాతావరణాన్ని ఎక్కడా సంచలనాత్మకం చేయకుండా ఒక స్లో-బర్న్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా మలిచారని వర్మ ప్రశంసించారు.


ఒక ప్రజాస్వామ్యం తన సొంత పౌరులనే ఎలా మింగేస్తుంది, ఆపై దానికి సంబంధించిన సాక్ష్యాలను చెరిపివేయడానికి ఎలా ప్రయత్నిస్తుందనే కోణాన్ని ఎక్కడా ఉపన్యాసాలు ఇవ్వకుండా చూపించడం మామూలు విషయం కాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ కళ అయినా విజయం సాధించినట్లేనని, ప్రస్తుతం ‘సత్లుజ్’ ఎదుర్కొంటున్న సమస్యలే దీనికి నిదర్శనమన్నారు. 


నేటి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కేవలం వినోదం కోసం పరుగెడుతుంటే, ఒక నిజాయతీ గల సినిమా ఎంతటి అద్భుతాలు సృష్టించగలదో ఈ చిత్రం నిరూపించిందన్నారు. ‘సత్లుజ్’ను ప్రతి ఒక్కరూ చూసి సినిమాపై చర్చించాలని కోరారు. చిత్రంలోని బాధితులను ఎన్‌కౌంటర్ చేసినట్టుగా... ఈ సినిమాను కూడా ఎన్‌కౌంటర్ చేయవద్దని అన్నారు. జస్వంత్ సింగ్ ఖల్రాకు చేసిన అన్యాయాన్ని దీనికి చేయవద్దని అధికార వర్గాలకు విజ్ఞప్తి చేశారు. సత్యాన్ని దాచాలని చూస్తే అది మరింత బలంగా తిరగబడుతుందని ఆయన ముగించారు.

Advertisement

More Telugu News