హిందూ మఠాధిపతులను తిడితే జగన్ వెనకేసుకొస్తారా?: కోటంరెడ్డి ఫైర్
- మఠాధిపతులను కించపరుస్తూ మాట్లాడిన రావణ్ ను జగన్ ఎలా వెనకేసుకొస్తారన్న కోటంరెడ్డి
- దేశద్రోహ వ్యాఖ్యలు చేసేవారికి వంతపాడటం సరికాదని వ్యాఖ్య
- దేశ ప్రజలకు జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
హిందూ మఠాధిపతులు, పూజారులను కించపరుస్తూ మాట్లాడిన యూట్యూబర్ రావణ్ (జోసెఫ్)ను వైసీపీ అధినేత జగన్ ఎలా వెనకేసుకొస్తారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ వైఖరిని ఎండగట్టారు. తనకు దేశభక్తి లేదని స్వయంగా జోసెఫ్ బహిరంగంగా చెబుతుంటే, అలాంటి వ్యక్తిని జగన్ ఏ విధంగా సమర్థిస్తారని ఆయన సూటిగా నిలదీశారు. దేశద్రోహ వ్యాఖ్యలు చేసేవారికి వంతపాడటం నాయకత్వ లక్షణం కాదన్నారు.
రావణ్ పై నమోదైన కేసుల విషయాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయని కోటంరెడ్డి స్పష్టం చేశారు. తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే న్యాయస్థానం అతడిని రిమాండ్‌కు పంపిందని గుర్తుచేశారు. ఇలాంటి సున్నితమైన విషయంలో దేశభక్తి లేని వ్యక్తికి మద్దతు తెలుపుతున్న వైసీపీ అధినేత వైఖరి అత్యంత దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు.
దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రావణ్ కు మద్దతిచ్చిన జగన్.. తక్షణమే యావత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు హిందూ మత విశ్వాసాల మీద, సాధుసంతుల మీద విచక్షణారహితంగా దాడి చేసిన ఇలాంటి వ్యక్తులు... రేపు ఇతర మతాలపై దాడి చేయరని గ్యారంటీ ఏమిటని ఆయన ప్రశ్నించారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే వ్యక్తులను రాజకీయ స్వార్థం కోసం ప్రోత్సహించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.