చైనాలో భారీ అవినీతి.. అధికారికి మరణశిక్ష విధించిన కోర్టు

Chinese Official Sentenced To Death For Taking Bribes Over 30 Years
  • మాజీ అధికారి యాంగ్‌కు మరణశిక్ష
  • 30 ఏళ్లలో రూ.2,800 కోట్లు లంచంగా తీసుకున్నట్లు తేల్చిన కోర్టు
  • ప్రాజెక్టులు, భూముల కేటాయింపుల్లో అవినీతి
  • మరో ఐదు నేరాల్లోనూ దోషిగా తీర్పు
  • ఆస్తుల స్వాధీనం, లంచాల సొమ్ము రికవరీకి ఆదేశం
  • షీ జిన్‌పింగ్‌ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేసు
చైనాలో భారీ అవినీతి కేసులో మాజీ ఆర్థికాభివృద్ధి అధికారి యాంగ్‌ యూలిన్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. మూడు దశాబ్దాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.2,800 కోట్లు లంచాల రూపంలో స్వీకరించినట్లు కోర్టు తేల్చింది. ఇటీవలి కాలంలో చైనాలో వెలుగుచూసిన అతిపెద్ద అవినీతి కేసుల్లో ఇదొకటిగా నిలిచింది.

యాంగ్‌ యూలిన్‌ 1993 నుంచి 2023 వరకు పలు ప్రాజెక్టులు, వ్యాపార అనుమతులు, భూముల కేటాయింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌కు సంబంధించిన అంశాల్లో సాయం చేస్తూ భారీగా లంచాలు తీసుకున్నట్లు చాంగ్‌జౌ ఇంటర్మీడియట్‌ పీపుల్స్‌ కోర్టు వెల్లడించింది. లంచాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రజాధనాన్ని మళ్లించడం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్‌, లంచాలు ఇవ్వడం వంటి ఆరోపణల్లోనూ ఆయన దోషిగా తేలాడు. కోర్టు విచారణలో తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు న్యాయస్థానం తెలిపింది.

ఈ కేసు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రత్యర్థులను పక్కన పెట్టేందుకూ ఉపయోగిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌లో ఈ కేసుపై బహిరంగ విచారణలు జరిగాయి. యాంగ్‌కు చెందిన వ్యక్తిగత ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలని, లంచాల రూపంలో పొందిన మొత్తం సొమ్మును తిరిగి రాబట్టాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల చైనాలో అవినీతి కేసుల్లో మరణశిక్ష ఎదుర్కొన్న అధికారుల్లో యాంగ్‌ కూడా ఒకరు. 2021లో ప్రభుత్వ రంగ సంస్థ మాజీ అధికారి లై షియామిన్‌ను ఉరి తీశారు. 2024లో ఇన్నర్‌ మంగోలియాకు చెందిన మాజీ అధికారి లీ జియాన్‌పింగ్‌కు కూడా మరణశిక్ష అమలు చేశారు.
Advertisement
Bribe
China
Death Sentence

More Telugu News