జయలలితకు ఒక న్యాయం.. జగన్‌కు మరో న్యాయమా?: చింతా మోహన్

Chinta Mohan questions if there is one law for Jayalalithaa and another for Jagan
  • జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ల తరబడి సాగుతుండటంపై చింతా మోహన్ విస్మయం
  • న్యాయ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతోందా? అని ప్రశ్న
  • అయోధ్య రామాలయం పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపణ
  • కుప్పంలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చంద్రబాబు వివరించాలని డిమాండ్

వైసీపీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగుతుండటంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో ఒకలా, ఏపీలో జగన్ కేసులో మరోలా న్యాయం జరుగుతోందా? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యం చూస్తుంటే న్యాయవ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతోందా? అనే అనుమానం సామాన్య ప్రజల్లో కూడా బలంగా కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణ అంశంపై కూడా ఆయన స్పందించారు. అయోధ్యలో జరిగిన రామాలయ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల పేరిట వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవుడి పేరుతో జరిగిన ఈ నిధుల దుర్వినియోగంపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.


మరోవైపు, ప్రధాని మోదీ విదేశాంగ విధానంపైనా, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలనపైనా చింతా మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవలి ఇజ్రాయిల్ పర్యటనలో ప్రధాని ఏయే అంశాలపై చర్చలు జరిపారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలని కోరారు. గాజాలో వేలాది మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నా భారత విదేశాంగ శాఖ స్పందించకపోవడం విచారకరమని, మోదీ పూర్తిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 


ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై స్పందిస్తూ... రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో ఏ ఒక్క జిల్లాలోనూ ఆ అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అసలు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని, మాటలతో కాకుండా పనులతో నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Chinta Mohan
YS Jagan Mohan Reddy
Jayalalithaa
Ayodhya Ram Mandir
Chandrababu Naidu
CBI Inquiry

More Telugu News