ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్‌పోర్టులు... జాబితాలో రెండు భారత విమానాశ్రయాలు

World most beautiful airports list includes two Indian airports
  • ప్రపంచంలోని అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల జాబితా విడుదల
  • ప్రిక్స్ వెర్సైల్స్ 2026 జాబితాలో రెండు భారత విమానాశ్రయాలు
  • గౌహతి, నవీ ముంబై ఎయిర్‌పోర్టులకు దక్కిన అరుదైన గౌరవం
  • ఆధునిక డిజైన్, సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు
భారత విమానయాన రంగం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. దేశంలోని రెండు విమానాశ్రయాలు ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బొర్దొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (టెర్మినల్-2), నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (టెర్మినల్-1) ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, డిజైన్ అవార్డు అయిన 'ప్రిక్స్ వెర్సైల్స్ 2026' తాజాగా ఈ జాబితాను విడుదల చేసింది.

పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రకటించే ఈ పురస్కారం, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన లేదా ఆధునికీకరించిన విమానాశ్రయాలను గుర్తిస్తుంది. ఆధునిక డిజైన్, పర్యావరణ హిత నిర్మాణం, సాంస్కృతిక గుర్తింపు, ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ఎంపిక చేపడతారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడు విమానాశ్రయాలు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

గౌహతిలోని టెర్మినల్-2ను ఈశాన్య భారతానికి ప్రత్యేకమైన 'వెదురు ఆర్కిడ్' పుష్పాల స్ఫూర్తితో నిర్మించారు. టెర్మినల్ లోపల 'ఇండోర్ స్కై ఫారెస్ట్', అస్సామీ సంప్రదాయ హస్తకళల మేళవింపుతో దీనికి రూపకల్పన చేశారు. 

ఇక, అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1ను 'కమలం' ఆకృతిలో నిర్మించారు. సహజ సిద్ధమైన వెలుతురు, గాలి ప్రసరణకు పెద్దపీట వేస్తూ, ఇంధన వినియోగాన్ని తగ్గించేలా దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారు.

ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనాలోని గ్వాంగ్‌జౌ, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్, అమెరికాలోని పిట్స్‌బర్గ్‌, శాన్ డియాగో విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. విమానాశ్రయాలను కేవలం రవాణా కేంద్రాలుగానే కాకుండా, అద్భుతమైన సాంస్కృతిక చిహ్నాలుగా తీర్చిదిద్దడంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని ఈ అంతర్జాతీయ గుర్తింపు చాటిచెబుతోంది.
Prix Versailles
Guwahati Airport
Navi Mumbai Airport
Most Beautiful Airports
UNESCO
Indian Aviation

More Telugu News